మరో వివాదం లో బాహుబలి-2

0Baahubali-working-stillఈ నెల 28న అట్టహాసంగా విడుదలయ్యేందుకు ముస్తాబవుతోన్న బాహుబలి-2 సినిమాపై మరో వివాదంరాజుకుంది. చరిత్రలో ఏ సినిమాకూ లేని విధంగా చంద్రబాబు ప్రభుత్వం బాహుబలి-2కు మాత్రమే ఆరు షోలు ప్రదర్శించుకునేలా అనుమతి ఇవ్వడంపై అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి. ప్రభుత్వ నిర్ణయం నూటికినూరుపాళ్లు చట్టవ్యతిరేకమని, ఆరు షోలకు అనుమతినిస్తూ జారీచేసిన ఉత్తర్వులను వెంటనే రద్దుచేయాలని తెలుగు సినిమా ప్రేక్షుల సంఘం డిమాండ్‌ చేసింది.

ఈ మేరకు ప్రేక్షకుల సంఘం సభ్యులు సోమవారం ఏపీ హోంశాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ అనురాధను కలిసి తమ అభ్యంతరాలను తెలిపారు. సినిమా థియేటర్లలో షోలను ప్రదర్శించాల్సిన వేళలపై చట్టంలో చాలా స్పష్టమైన అంశాలు ఉన్నాయని ప్రేక్షకుల సంఘం వాదిస్తోంది. రాత్రి 1 గంటల నుంచి ఉదయం 8 గంటలవరకు సినిమా థియేటర్లలో ప్రదర్శనలు ఉండరాదని చట్టంలో ఉండగా, అందుకు విరుద్ధంగా బాహుబలి-2కు ఆరు షోల అనుమతి ఇవ్వడం సరికాదని సంఘం పేర్కొంది.

అభ్యంతరాలపై స్పందించిన ప్రిన్సిపల్‌ సెక్రటరీ.. విషయాన్ని ప్రభుత్వానికి చేరవేస్తానని బదులిచ్చారు. ఒకవేళ సకాలంలో ప్రభుత్వం స్పందించకుంటే సంఘం సభ్యులు కోర్టును ఆశ్రచించే అవకాశాలున్నాయి. బాహుబలి-2కు ఆరు షోల అనుమతినిస్తూ ఏపీ సర్కార్‌ శనివారం జీవో జారీచేసిన సంగతి తెలిసిందే.

తెలంగాణలోనూ బాహుబలికి బంపర్‌ ఆఫర్‌!

ఏపీ ప్రభుత్వం మాదిరే తెలంగాణ సర్కార్‌ కూడా బాహుబలి-2కు బంపర్‌ ఆఫర్‌ ఇచ్చే యోచనలో ఉన్నట్లు తెలిసింది. సోమవారం బాహుబలి నిర్మాతలు తనను కలిసివెళ్లిన అనంతరం సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ మీడియాతో మాట్లాడారు. నిర్మాతలు తనతోపాటు ప్రభుత్వాధికారులనూ ప్రత్యేక షోకు ఆహ్వానించారని చెప్పిన తలసాని.. షోల సంఖ్య పెంపుపైనా చర్చ జరిగినట్లు తెలిపారు. ‘ఇది మన సినిమా. దీనిని తప్పకుండా ప్రోత్సహిస్తాం. ఐదు షోలకుగానీ, అవసరమైతే ఆరు షోలకు గానీ అనుమతులు ఇచ్చేందుకు మాకు ఎలాంటి అభ్యంతరం లేదు. సీఎం కేసీఆర్‌కూడా ఇందుకు సానుకూలంగా ఉన్నారు’ అని తలసాని చెప్పారు. అయితే షోల పెంపుకు సంబంధించిన అధికారిక ప్రకటన మాత్రం ఇంకా వెలువడలేదు.