ఆ పాపం వైఎస్ దే.. !

0baireddy-rajasekara-reddyరాయలసీమ ప్రాంతానికి మిగులు జలాలు లేకుండా చేసిన పాపం దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర రెడ్డిదేనని రాయలసీమ పరిరక్షణ సమితి పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు బైరెడ్డి రాజశేఖర్‌రెడ్డి ఆరోపించారు. బైరెడ్డి ఈరోజు (మంగళవారం) విలేకరులతో మాట్లాడుతూ.. ప్రత్యేక తెలంగాణకు వైయస్ రాజశేఖర రెడ్డి బీజం వేస్తే, తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు ఆజ్యం పోశారని నిప్పులు చెరిగారు. వైయస్, బాబులు పాముకు పాలు పోసి పెంచారని విమర్శించారు. పనిలో పనిగా ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిపైనా విరుచుకుపడ్డారు. సీఎంకు సీమాంధ్ర ప్రాంతంపైన ఉన్నది కపట ప్రేమ మాత్రమేనని ఎద్దేవ చేశారు. సాగునీటి ప్రాజెక్టుల పైన కిరణ్‌కు అవగాహన లేదని బైరెడ్డి అన్నారు.

రాష్ట్ర రాజకీయాల్లో ముగ్గురు మోసగాళ్లు తమ ప్రాంతానికి చెందిన వారేనని భైరెడ్డి చెప్పుకొచ్చారు. ఇక్కడ సమైక్యం అంటున్న నేతలు.. అక్కడ సోనియా దగ్గరకు వెళ్లి ’రాయల తెలంగాణ’ అంటున్నారని ఆయన ఆరోపించారు. ఢిల్లీలో ధర్నాలన్నీ ప్రెస్ ముందేనని.. జనాన్ని పక్కదోవ పట్టించే నాయకుల్ని నమ్మవద్దని భైరెడ్డి సీమాంధ్ర ప్రజలకు విజ్ఞప్తి చేశారు.