ఎన్టీఆర్ సమస్తం బాలయ్యేనా?

0ఒక్కో పోస్టర్ తో ఒక్కో అంచనా పెంచేసుకుంటూ పోతున్న ఎన్టీఆర్ బయోపిక్ షూటింగ్ నిర్విఘ్నంగా కొనసాగుతోంది. క్రమం తప్పకుండా ఇందులో ఒక్కో పాత్రను రివీల్ చేస్తున్న తీరు క్రిష్ మార్కెటింగ్ కి అద్దం పడుతోంది. ఇప్పటికే యాభై శాతం దాకా షూటింగ్ పూర్తయినట్టు వినికిడి. ఇది తలపెట్టిన సమయంలో ఉన్న ముగ్గురు నిర్మాతలు ఇప్పుడు ఒక్కరిగా అది కూడా బాలయ్యే కాబోతున్నారని తాజా సమాచారం. భాగస్వాములుగా ఉన్న సాయి కొర్రపాటి విష్ణు ఇందూరిలకు ఇప్పటి దాకా చేసిన వ్యయానికి తగ్గట్టు సెటిల్మెంట్ చేసేసి పూర్తిగా తన ఎన్ బికె ఫిలిమ్స్ బ్యానర్ మీదే ఇది వచ్చేలా బాలకృష్ణ ప్రణాళిక వేస్తున్నట్టు తెలిసింది. ఇది ఇంకా చర్చల దశలలోనే ఉంది కాబట్టి కొలిక్కి రావడనికి కొంత సమయం పట్టొచ్చు. ఎన్టీఆర్ మొదలుపెట్టే టైంకి ఇప్పటికి హైప్ పరంగా చాలా తేడా ఉండటంతో బిజినెస్ పరంగా సైతం మంచి ఆఫర్స్ దక్కుతున్నాయి.

తెలుగు సినిమా చరిత్రలో ఒక ప్రత్యేకమైన స్థానం సంపాదించే సినిమాగా ఎన్టీఆర్ నిలిచిపోతుందని బాలయ్య చాలా నమ్మకంగా ఉన్నాడు. అయితే పూర్తి పెట్టుబడి పెట్టగలిగే స్థోమత తనకే ఉన్నప్పుడు నాన్న గారి కథతో తీసే సినిమాకు తన పేరు మీద ఉండే బ్యానర్ అయితే శాశ్వతంగా నిలిచిపోతుంది కదా అనే ఆలోచన చేసినట్టు కనపడుతోంది. వినిపిస్తున్న టాక్ ప్రకారం యాభై కోట్ల రేంజ్ నుంచి వంద కోట్ల రేంజ్ దాకా వెళ్లే అవకాశాల గురించి బాలకృష్ణకు మంచి రిపోర్ట్స్ వస్తున్నాయట. కీలక పాత్రలని పేరున్న ఆర్టిస్టులు చేస్తుండటంతో బాగా హెల్ప్ అవుతోంది. మహానటి 45 కోట్ల దాకా రాబట్టగలిగినప్పుడు ఇందరేసి స్టార్లు ఉన్న ఎన్టీఆర్ అంతకు రెట్టింపు ఆశించడం తప్పేమి కాదని అభిమానులు సైతం చాలా ఆశలే పెట్టేసుకున్నారు. సంక్రాంతిని టార్గెట్ చేసుకున్న ఎన్టీఆర్ ఇప్పుడున్న ప్లానింగ్ ప్రకారం ఎలాంటి బ్రేకులు లేకుండా షూటింగ్ చేసుకుంటే టార్గెట్ డేట్ కి వచ్చేయొచ్చు. తన మరోసినిమా మణికర్ణిక గొడవను పట్టించుకోకుండా మరీ దర్శకుడు క్రిష్ ఎన్టీఆర్ మీదే పూర్తి ఫోకస్ పెట్టినట్టుగా కనిపిస్తోంది.