ఉద్వేగానికి గురైన బాలకృష్ణ…

0Balakrishna-gets-emotional-దర్శకరత్న దాసరి నారాయణరావు ఆకస్మిక మృతి కారణంగా విదేశాల్లో ఉన్న సినీ ప్రముఖులు ఆయనను చివరిసారి దర్శించుకోలేకపోయారు. విదేశాల్లో తాము ఉన్న ప్రాంతం నుంచే సంతాప సందేశాలను మీడియా ద్వారా, సోషల్ మీడియా ద్వారా వ్యక్తం చేశారు. వారిలో మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణ, డైరెక్టర్ పూరీ జగన్నాథ్ ఉన్నారు. తాజాగా దాసరి పెద్ద కర్మను పురస్కరించుకొని పోర్చుగల్‌లో బాలయ్య, పూరీ జగన్నాథ్ తదితరులు శ్రద్ధాంజలి ఘటించారు.

పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందుతున్న పైసా వసూల్ చిత్రం కోసం నందమూరి బాలకృష్ణ పోర్చుగల్‌లో ఉన్నారు. దాసరి మృతి తెలియగానే అక్కడి నుంచే బాలయ్య, పూరీ జగన్నాథ్ సంతాపాన్ని ప్రకటించిన సంగతి తెలిసిందే. దాసరి కుటుంబ సభ్యులతో చిత్ర యూనిట్ మాట్లాడి పరామర్శించినట్టు సమాచారం.

చైనా పర్యటన నుంచి మెగాస్టార్ చిరంజీవి వచ్చిన తర్వాత తెలుగు చిత్ర పరిశ్రమ తరఫున దాసరికి నివాళి అర్పిస్తూ సంతాప సభను ఏర్పాటు చేసింది. ఆ సభలో చిరంజీవితోపాటు ఆర్ నారాయణమూర్తి లాంటి సినీ ప్రముఖులు ఆవేదన వ్యక్తం చేశారు. దాసరికి నివాళులర్పించడంలో పరిశ్రమలో కొందరు పెద్దలు వ్యవహరించిన తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు.

దాసరి పెద కర్మను కుటుంబ సభ్యులు ఆదివారం హైదరాబాద్‌లోని ఇమేజ్ గార్డెన్‌లో నిర్వహించారు. దాసరి పెద్ద ఖర్మ సందర్భంగా పైసా వసూల్ చిత్ర యూనిట్ పోర్చుగల్‌లో దర్శకరత్నకు శ్రద్ధాంజలి ఘటించారు. ఈ కార్యక్రమంలో బాలకృష్ణ, భవ్య క్రియేషన్ ఎగ్జిక్యూటివ్ నిర్మాత కొమ్మినేని వెంకటేశ్వరరావు, దర్శకుడు పూరీ జగన్నాథ్, పూరీ జగన్నాథ్ కూతురు పవిత్ర సినిమాటోగ్రాఫర్ ముఖేశ్, ఫైట్ మాస్టర్ వెంకట్ తదితరులు పాల్గొన్నారు.

ఈ కార్యక్రమంలో దాసరిని తలచుకొని నటసింహ నందమూరి బాలకృష్ణ ఉద్వేగానికి గురయ్యారట. తన తండ్రితో దాసరి చేసిన చిత్రాలను, తనతో చేసిన పరమ వీర చక్ర చిత్రాలను ఈ సందర్భంగా గుర్తు చేసుకొన్నారట. చిత్ర పరిశ్రమకు దాసరి చేసిన సేవలను ఈ సందర్బంగా చిత్ర యూనిట్‌కు తెలియజేసినట్టు సమాచారం. దాసరి చిత్ర పటానికి దండవేసి బాలకృష్ణ, పూరీ జగన్నాథ్ మొక్కుతున్న చిత్రాలను పోర్చుగల్ నుంచి విడుదల చేశారు.