ఎన్టీఆర్ బయోపిక్.. ఈ ప్రశ్నలకు ఆన్సరుంటుందా.?

0మొన్నమధ్యే హిందీలో ప్రముఖ బాలీవుడ్ హీరో సంజయ్ దత్ బయోపిక్ ‘సంజూ’ వచ్చేసింది. అందులో సంజు చేసిన తప్పులేవీ పెద్దవి కానట్టు.. సందర్భానుసారం అలా మారిపోయాడని.. చాలా మంచి బాలుడు అని ఫోకస్ చేశారు. ఎందుకంటే దర్శకుడు రాజ్ కుమార్ హిరానీ స్వయానా సంజయ్ దత్ కు ఆప్తమిత్రుడు – శ్రేయోభిలాషి. అందుకే ముంబై పేలుళ్లలో ఆరోపణలు ఎదుర్కొన్న సంజయ్ దత్ ఉదంతాన్ని హిరాణీ పెద్దగా చూపించలేదు..ఇలా బయోపిక్ లలోనూ విలన్లను హీరోలుగా చూపించేయవచ్చని.. సంజు చూశాక తనకు అర్థమైందని.. అసలైన సంజూ చిత్రాన్ని తాను తీస్తానని రాంగోపాల్ వర్మ సంచలన ప్రకటన చేశారు.

ఇప్పుడు తెలుగు నాట కూడా మరో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. ఎన్టీఆర్ బయోపిక్ కు ఆయన కుమారుడు బాలయ్య రంగం సిద్ధం చేస్తున్నారు. ఇందుకోసం ఇప్పటికే కథ సిద్ధమైంది. నిజానికి ఎన్టీఆర్ జీవితం లో చంద్రబాబు పాత్ర కీలకం.. ఎన్టీఆర్ ను పదవీ చిత్యుడిని చేసి చంద్రబాబు అధికారాన్ని హస్తగతం చేసుకున్నారు. దీనికి మనస్తాపం చెంది ఎన్టీఆర్ గుండెపోటుకు గురై మరణించారు… మరి ఈ సున్నితమైన అంశం ఎన్టీఆర్ బయోపిక్ లో ఎలా చూపిస్తారన్నది అందరిలోనూ ఆసక్తి రేపుతోంది.

తాజాగా మొన్నీ మధ్యే.. బాలయ్య – రానా – దర్శకుడు క్రిష్ వచ్చి ఎన్టీఆర్ బయోపిక్ విషయంలో చంద్రబాబు సలహాలు తీసుకున్నారు.. చంద్రబాబును ఎలా చూపించాలి.. ఎలా చూపిస్తే ఆయనకు బెటరో చర్చ జరిగిందని వార్తలు లీక్ అయ్యాయి.

ఇక మరో ఆసక్తికర విషయం ఏంటంటే ఎన్టీఆర్ రాజకీయంగా ఎదగడంలో పలువురు కీలక పాత్ర పోషించారు. ఎన్టీఆర్ కు -జాతీయ రాజకీయాలకు మధ్య వారధిగా ఉన్న ఉపేంద్ర – ఎన్టీఆర్ కు హిందీ పాఠాలు చెప్పిన యార్లగడ్డను – చంద్రబాబు రాకముందు ఎన్టీఆర్ కు అన్నీ తానై వ్యవహరించిన దగ్గుబాటి వెంకటేశ్వరరావు ఇంకా మరికొందరు ఎన్టీఆర్ సన్నిహితులకు ఈ బయోపిక్ లో అవకాశం ఉంటుందా లేదా అన్నది మిలియన్ డాలర్ల ప్రశ్న.. అందరికంటే ముఖ్యంగా ఎన్టీఆర్ చైతన్యయాత్ర కోసం కొన్ని వేల కిలోమీటర్లు నిద్రాహారాలు మాని అవిశ్రాంతంగా వ్యాన్ నడిపిన హరికృష్ణ పాత్ర సినిమాలో ఎంత వరకూ ఉంటుందనేది అందరినీ వేధిస్తున్న ప్రశ్న..

ఎన్టీఆర్ జీవితం తెరిచిన పుస్తకమే.. ఆయన జీవితంలో జరిగిన సంఘటనలన్నింటిని మనం చూశాం.. మరి బాలయ్య ఇదంతా చూపిస్తారా.? ఏమైనా మార్పులు చేస్తారా అన్నది ఆసక్తిగా మారింది.ముఖ్యంగా చంద్రబాబును ఈ బయోపిక్ లో ఎలా చూపిస్తారనేది అందరిలోనూ క్యూరియాసిటీని పెంచుతోంది. చూడాలి మరి..