ఎన్టీఆర్ టైంకు రాగలడా?

0స్వర్గీయ నందమూరి తారకరామారావు గారి బయోపిక్ గా క్రిష్ దర్శకత్వంలో బాలకృష్ణ రూపొందిస్తున్న ఎన్టీఆర్ షూటింగ్ ప్రస్తుతం పెద్దగా విఘ్నాలు లేకుండా కొనసాగుతోంది. ఇటీవలే అన్న హరికృష్ణ మరణం వల్ల మూడు రోజులు బ్రేక్ వచ్చినా ఎక్కువ ఆలస్యం చేయకుండా రంగంలోకి దిగిపోయాడు బాలయ్య. ఆర్టిస్టులు చాలా మంది ఉండటంతో కాంబో సీన్లకు ఇబ్బంది ఏర్పడుతుంది కాబట్టి ప్లానింగ్ లేకుండా షూటింగ్ ఆపడానికి లేదు. షూటింగ్ ఆలస్యంగానే మొదలుపెట్టుకున్న ఎన్టీఆర్ కు ఇప్పుడు విడుదల తేదీ రూపంలో కొత్త టెన్షన్ మొదలయ్యిందని టాక్. సంక్రాంతికి విడుదల చేయాలనీ బాలయ్య పట్టుదలగా ఉన్నా ఎన్టీఆర్ నట జీవితంలో ఉన్న ఎందరో హీరోలను ఆర్టిస్టులను ఇందులో ప్రముఖుల ద్వారా చూపిస్తుండటంతో కాల్ షీట్స్ సమస్య వస్తోందని తెలిసింది. క్వాలిటీతో వేగంగా పూర్తి చేయటంలో దర్శకుడు క్రిష్ కు ఎంత పేరున్నా వనరులన్నీ చేతిలో ఉన్నప్పుడు మాత్రమే తను ఆ పని చేయగలడు.

ఇప్పుడు పరిస్థితి చూస్తే దానికి భిన్నంగా ఉందట. కీలకమైన కొందరు ప్రముఖుల పాత్రలకు సంబంధించి ఇంకా సరైన ఆర్టిస్టులు దొరకనేలేదట. ప్రస్తుతానికి రానా-ప్రకాష్ రాజ్-సుమంత్ లాంటివాళ్లతో సెటప్ రెడీగా ఉన్నప్పటికీ ఇంకా చాలా పాత్రలు పెండింగ్ లో ఉన్నాయట. చేతిలో సరిగ్గా 120 రోజుల సమయం మాత్రమే మిగిలి ఉంది. ఆ లోపే టాకీ పార్ట్ షూటింగ్ పాటల చిత్రీకరణ డబ్బింగ్ తో పాటు పోస్ట్ ప్రొడక్షన్ మొత్తం పూర్తి చేయాలి. ఇటు చూస్తే ఇంకా ముప్పై శాతం షూటింగ్ కూడా పూర్తి కాలేదని వినికిడి. ఈ నేపధ్యంలో సంక్రాంతి డెడ్ లైన్ అందుకోవడం మీద అనుమానాలు ముసురుకుంటున్నాయి. ఎన్టీఆర్ తో పాటు రామ్ చరణ్ బోయపాటి సినిమా ప్లస్ వెంకటేష్ వరుణ్ తేజ్ ల ఎఫ్2 కూడా స్లాట్ బుక్ చేసుకోవడంతో మిగిలిన నిర్మాతలు సాహసం చేయలేకపోతున్నారు. ఒకవేళ ఎన్టీఆర్ ఏ మాత్రం వెనుకడుగు వేసినా మరో రెండు సినిమాలకు ఛాన్స్ దొరికినట్టే. మరో నెల రోజులు ఆగితే కానీ దీని సంబందించిన క్లారిటీ రాదు.