ఎన్టీఆర్ కి నివాళులర్పించిన బాలయ్య

0Balakrishna-pays-tribute-ntrఎన్టీఆర్ నింగికేగి 22ఏళ్లైనా.. ఆయన నటనా వైభవం మదిలోనే మెదలుతోందని ఆయన కుమారుడు, టిడిపి ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ అన్నారు. ఎన్టీఆర్ 21వ వర్ధంతి సందర్భంగా రసూల్‌పురాలో ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులర్పించిన ఆయన.. అమరజ్యోతి ర్యాలీని ప్రారంభించారు.

ఈ సందర్భంగా పావురాలను గాల్లోకి ఎగిరురవేసి అనంతరం మీడియాతో మాట్లాడారు. ఎన్టీఆర్.. తన నటనతో ఎన్నో పాత్రలకు జీవం పోశారని అన్నారు. నటుడిగా ఆయన వెదజల్లిన వెలుగు నేటికీ కొనసాగుతోందని అన్నారు. నట నర్సింహుడైన ఆయన మన గుండెల్లో మెండుగా ఉంటాడని అన్నారు.

రాజకీయాల్లోకి వచ్చిన ఆయన పేద ప్రజల సంక్షేమం కోసం నిరంతరం పని చేశారని చెప్పారు. బడుగు బలహీన వర్గాలు, మైనార్టీల కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలను తీసుకొచ్చారని చెప్పారు. బడుగుబలహీన వర్గాలను అధికారంలోకి తీసుకొచ్చారని తెలిపారు.

ఎన్టీఆర్ అంటే ఎన్టీఆర్ ఆవేశం.. ఉద్యమం.. ఒక క్రమశిక్షణ.. పట్టుదల.. నిరంతర కృషి అని బాలకృష్ణ చెప్పారు. ఆయన స్థాపించిన టిడిపిలో కార్యకర్తలు ఎంతో క్రమశిక్షణతో ఉంటారని అన్నారు. దేశంలోని ఏ పార్టీకి లేని కార్యకర్తలున్నారని అన్నారు. ఎన్టీఆర్ స్ఫూర్తితో ముందుకు సాగుతామని చెప్పారు.

పార్టీ పెట్టిన స్వల్పకాలంలోనే అధికారంలోకి వచ్చిన ప్రపంచంలోనే ఏకైక పార్టీ టిడిపి అని టీటీడీపీ అధ్యక్షుడు ఎల్ రమణ అన్నారు. ఈ కార్యక్రమంలో రేవంత్ రెడ్డి, టిడిపి నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.

కాగా, ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌లో వద్ద ఏపీ సీఎం చంద్రబాబునాయుడు సతీమణి భువనేశ్వరి, కోడలు బ్రాహ్మణి, టిడిపి నేతలు మోత్కుపల్లి నర్సింహులు, సండ్ర వెంకటవీరయ్యలు నివాళులర్పించారు.