అరవింద సమేత ఆడియో :అదుగో పులి ఇదుగో…

0ఎన్టీఆర్ ‘జైలవకుశ’ తర్వాత కాస్త గ్యాప్ తీసుకుని మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో చేస్తున్న చిత్రం ‘అరవింద సమేత’. భారీ అంచనాల నడుమ రూపొందుతున్న ఈ చిత్రం దసరాకు ఎట్టి పరిస్థితుల్లో తీసుకు వచ్చేందుకు చిత్ర యూనిట్ సభ్యులు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రస్తుతం చిత్రీకరణ చివరి దశకు చేరుకుంది. త్వరలోనే టాకీ పార్ట్ పూర్తి కాబోతుంది. ఇక మిగిలి ఉన్న పాటను వారం రోజుల పాటు విదేశాల్లో చిత్రీకరించేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఇదే సమయంలో సినిమా ఆడియో విడుదల కార్యక్రమంకు ఏర్పాట్లు చకచక జరుగుతున్నాయి. సెప్టెంబర్ 20వ తారీకున ఆడియో విడుదల కార్యక్రమం నిర్వహించబోతున్న విషయం తెల్సిందే.

ఈ ఆడియో విడుదల కార్యక్రమంకు బాలకృష్ణ వస్తాడు అంటూ ప్రచారం జరుగుతున్న విషయం తెల్సిందే. నిన్న మొన్నటి వరకు బాలకృష్ణ వచ్చే అవకాశం ఉందని ఫ్యాన్స్ సోషల్ మీడియాలో చర్చించుకోవడం చూశాం. తాజాగా షోషల్ మీడియాలో మరో ఆసక్తికర పుకారు షికారు చేస్తోంది. ఎన్టీఆర్ స్వయంగా త్రివిక్రమ్ మరియు నిర్మాత రాధాకృష్ణతో కలిసి బాబాయి బాలకృష్ణ వద్దకు వెళ్లి ‘అరవింద సమేత’ చిత్రం ఆడియో విడుదల కార్యక్రమంలో పాల్గొనాల్సిందిగా కోరడం జరిగిందని అందుకు బాలయ్య సానుకూలంగా స్పందించాడని 20వ తారీకు తేదీని ఆయనే సూచించడం జరిగిందని కూడా పుకార్లు షికార్లు చేస్తున్నాయి.

ఇప్పటి వరకు సోషల్ మీడియాలో మరియు సినీ వర్గాల్లోనే ఈ చర్చ జరుగుతుంది కాని చిత్ర యూనిట్ సభ్యుల నుండి ఎలాంటి క్లారిటీ రాలేదు. అదుగో పులి అంటే ఇదుగో తోక అన్నట్లుగా ఈ పుకార్లు పెరిగి పోతూ ఉన్నాయి. అయితే చిత్ర యూనిట్ సభ్యులు మాత్రం సినిమా ఆడియో వేడుకను సింపుల్ గా చెయ్యాలని అనుకుంటున్నారట. ఎన్టీఆర్ ఇంట్లో జరిగిన విషాదం కారణంగా వేడుకలు వద్దని అరవింద సమేత టీం భావిస్తున్నాట్లుగా కుడా సినీ వర్గాల నుండి టాక్ వినిపిస్తుంది. ఆడియో వేడుక గురించి వస్తున్న అనేక వార్తలకు చిత్ర యూనిట్ సభ్యులు ఒక క్లారిటి ఇవ్వాలని నందమూరి అభిమానులు కోరుకుంటున్నారు.