రాజశేఖర్‌ కోసం బాలయ్య..

0Balayya-Help-to-Rajasekharరాజశేఖర్‌ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘గరుడవేగ’. ఈ చిత్రానికి ప్రవీణ్‌ సత్తారు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా ట్రైలర్‌ను నందమూరి బాలకృష్ణ విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం పేర్కొంది. రేపు సాయంత్రం 8 గంటలకు బాలయ్య ఈ ట్రైలర్‌ను విడుదల చేయనున్నట్లు తెలిపింది. బంజారాహిల్స్‌లోని ఆర్కే సినీ కాంప్లెక్స్‌ ఈ కార్యక్రమానికి వేదిక కానున్నట్లు చెప్పింది. ఈ సందర్భంగా కొత్త పోస్టర్‌ను విడుదల చేసింది.

ఇటీవల ‘గరుడవేగ’ సినిమా టీజర్‌ను విడుదల చేశారు. ఈ ప్రచార చిత్రం హాలీవుడ్‌ స్థాయిలో ఉందని పలువురు ప్రముఖులు ట్విటర్‌ వేదికగా చిత్ర బృందాన్ని ప్రశంసించారు. ‘నక్షత్ర తాబేళ్లను కాపాడే’ నేపథ్యంలో చిత్ర కథ సాగుతుందని టీజర్‌ను చూస్తే అర్థమవుతోంది.

పూజాకుమార్‌, శ్రద్ధాదాస్‌, సంజయ్‌రెడ్డి, అలీ తదితరులు ఈ చిత్రంలో ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. బాలీవుడ్‌ నటి సన్నీలియోని ఓ ప్రత్యేక గీతంలో మెరవనున్నారు. శ్రీచరణ్‌ పాకాల బాణీలు అందించారు. ఆర్కే ఫిల్మ్స్‌ సంస్థ రూ.25 కోట్ల బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. త్వరలో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు.