పవన్ ను విమర్శిస్తావా అని బండ్లను అడిగితే..

0పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు తెలుగు సినీ పరిశ్రమలో అతి పెద్ద అభిమానులెవరని లిస్టు తీస్తే అందులో ముందు ఉండాల్సిన పేరు బండ్ల గణేష్ దే. పవన్ పేరెత్తితే చాలు ఊగిపోతుంటాడు బండ్ల. పవన్ ను తన దేవుడిగా అభివర్ణిస్తుంటాడతను. పవన్ గురించి ఎవరేమన్నా కూడా అతను ఊరుకోడు. టీవీ చర్చల్లో పవన్ కు మద్దతుగా మాట్లాడటమే కాక.. అతడి వ్యతిరేకులపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డాడు బండ్ల. అలాంటి వాడు రాజకీయాల్లోకి అడుగు పెడుతూ కాంగ్రెస్ పార్టీలో చేరడం అందరినీ ఆశ్చర్యపరిచింది. పవన్ జనసేన పార్టీలో అతను చేరతాడని.. ఎమ్మెల్యేగా కూడా పోటీ చేస్తాడని ఇంతకుముందు ప్రచారం జరిగింది.

కానీ అంచనాలకు భిన్నంగా అతను కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నాడు. కాంగ్రెస్ పార్టీ అంటే పవన్ కేమో గిట్టదు. గతంలో ఆ పార్టీ మీద తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డాడతను. కాంగ్రెస్ నాయకులు కూడా అతడిని లక్ష్యంగా చేసుకున్నారు. తెలంగాణలో జనసేన ప్రభావం అంతంతమాత్రమే అయినప్పటికీ అవసరమైతే పవన్ను కాంగ్రెస్ నాయకులు విమర్శించాల్సిందే. మరి ఈ పరిస్థితుల్లో బండ్ల గణేష్ ఏం చేస్తాడన్న ఆసక్తి అందరిలోనూ ఉంది. అతను కాంగ్రెస్ లో చేరిన నేపథ్యంలో అవసరమైన పవన్ ను విమర్శిస్తారా అని ఒక విలేకరి ప్రశ్నించాడు. దానికతను ఛాన్సే లేదని బదులిచ్చాడు. చచ్చినా పవన్ ను తాను విమర్శించనని అతను తేల్చి చెప్పాడు. పవన్ ఇప్పటికీ తన దేవుడే అని బండ్ల చెప్పాడు. ఐతే రాజకీయాల విషయానికొస్తే తాను చిన్నప్పటి నుంచి కాంగ్రెస్ వాదినే అని.. అందుకే ఆ పార్టీలో చేరానని బండ్ల తెలిపాడు.