చిరంజీవి బయోపిక్‌కు డైరెక్షన్ చేస్తా: బెనర్జీ

0Banerjeeతెలుగు సినీ పరిశ్రమలోని సీనియర్ నటుల్లో బెనర్జీ ఒకరు. నాలుగు తరాల సినీ నటులను చూసిన అనుభవం ఉంది. మొత్తం 35 ఏళ్లుగా టాలీవుడ్ చిత్రాల్లో నటిస్తున్నాడు. ఎన్ని చిత్రాల్లో నటించామన్న దృష్టితో కాకుండా ఎన్ని మంచి పాత్రల్లో నటించామన్న ఆలోచనతోనే బెనర్జీ సినిమాలను ఎంపిక చేసుకోవడం ఆయన ప్రత్యేకత. బెనర్జీ నటించిన రక్తం చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ చిత్రానికి బంగారుతల్లి ఫేం రాజేశ్ టచ్ రివర్ దర్శకుడు. ఈ సినిమా రిలీజ్‌కు ముందే విమర్శకలు ప్రశంసలు, అంతర్జాతీయ అవార్డులకు ఎంపికవుతున్నది. ఈ నేపథ్యంలో బెనర్జీ ఓ యూట్యూబ్ ఛానెల్‌తో ముచ్చటించారు. ఈ సందర్భంగా సినిమా పరిశ్రమకు సంబంధించిన పలు విషయాలను బెనర్జీ వెల్లడించారు.

నా అసలు పేరు వేణు బెనర్జీ. మాది కృష్ణాజిల్లా. మా కుటుంబానిది కమ్యూనిస్టుల నేపథ్యం. స్వాతంత్రానికి పూర్వం బెంగాల్ కమ్యూనిస్టుల పేర్ల ప్రభావం ఉండేది. కులమతాలకు సంబంధం లేకుండా చటర్జీ, బెనర్జీ, బోస్ లాంటి పేర్లు ఆ కాలంలో పెట్టుకొనే వారు. కృష్ణా జిల్లాలో ఎక్కువగా ఇది కనిపిస్తుంది.

నేను నటించిన సినిమాలలో నాకు మాటలు చాలా తక్కువ. దర్శకులు ఇచ్చిన పాత్రలు, కార్యెక్టర్ల మేరకు నటించాల్సి వచ్చింది. 1980లో నేను సినీ పరిశ్రమకు వెళ్లాను. డైరెక్టర్ కావాలనే కోరికతో నేను చెన్నైకి వెళ్లాను. హరిశ్చంద సినిమాకు అసిస్టెంట్‌గా చేరాను. యూఎస్ రావు దగ్గరనే అసోసియేట్‌గా పనిచేశాను. దర్శకత్వశాఖలో అన్ని మెలుకువలు ఆయనే నేర్పారు. దాదాపు 360కి పైగా చిత్రాల్లో నటించాను.

చిరంజీవి మొదటి సినిమా చేయకముందు నుంచి నాకు తెలుసు. ఆయన చిరంజీవి హీరోగా మల్లాది వెంకటకృష్ణమూర్తి రచన ధర్మయుద్దం అనే సినిమా చేయాలని నిర్మాత వెంకన్నబాబు అనుకొన్నారు. కానీ డేట్స్ సమస్య వల్ల చిరంజీవి చేయలేకపోయారు. అప్పుడు నాకు చిరంజీవితో పరిచయం జరిగింది.

ఏదైనా సాధించాలన్న చిరంజీవి తపన చూస్తే చాలా స్ఫూర్తినిస్తుంది. చాలా కష్టపడుతాడు. అందుకే ఆయన మెగాస్టార్ అయ్యాడు. అందరికీ అదీ సాధ్యం కాదు. అలాంటి వ్యక్తి గురించి నేను వేదిక మీద మాట్లాడటం పరిశ్రమలో చర్చనీయాంశమైంది. ఖైదీ నంబర్ 150 సినిమా కూడా తొలి చిత్రమనే భావనతో నటించాడు. చిరంజీవి చూసి చాలా నేర్చుకోవాల్సిన చాలా విషయాలు ఉన్నాయి.

తనకు నచ్చిన దర్శకుడితో తన బయోపిక్‌ను చేయాలనుకొంటే అది గొప్ప చిత్రం అవుతుంది. సాధారణ వ్యక్తిగా సినిమాలోకి ప్రవేశించి ఓ మెగాస్టార్ అయ్యేంత వరకు ఆయన ప్రస్థానం చాలా గొప్పగా ఉంటుంది. చిరంజీవికి సంబంధించి బయట ప్రపంచానికి తెలియని చాలా విషయాలు ఉన్నాయి. స్వయంగా చిరంజీవి ఓ స్క్రిప్ట్ రైటర్‌ను పెట్టుకొని కథ రాయించుకొని సినిమా తీస్తేనే అది గొప్ప చిత్రం అవుతుంది.

ఒకవేళ నా ప్రతిభను నమ్మి చిరంజీవి తన బయోపిక్‌కు దర్వకత్వం చేయమని చెప్తే అందుకు నేను సిద్దం అని బెనర్జీ అన్నారు. దర్శకత్వ శాఖలో అన్ని విషయాలు నాకు బాగా తెలుసు. సినిమా అనేది తల్లి గర్భంలోని బిడ్డలాంటింది. సినిమా అడుతుందో లేదో చెప్పడం ఎవ్వడికీ సాధ్యం కాదు. అందరూ బాగా ఆడుతుందనే తీస్తారు అన్నారు.

చిరంజీవి దర్శకత్వం చేసే అవకాశం రావడం, ఆయన అవకాశం ఇస్తారా అనేది చాలా ఊహజనీతమైనవి. అవి మాట్లాడుకోవడానికే బాగా ఉంటాయి. అంతేగానీ నాకే ఇవ్వాలని నేను అనుకొను. చిరంజీవిని ప్రాణం కంటే ఎక్కువగా అభిమానించే దర్శకులు చాలా మంది ఉన్నారు. నా కంటే ఎక్కువ ప్రతిభ ఉన్నవారు పరిశ్రమలో ఎక్కువనే ఉన్నారు.

రాంగోపాల్ వర్మ చాలా మేధావి. వివాదాలు, విమర్శలు అనేది ఆయన వ్యక్తిగతం. తనకు నచ్చిన విధంగా ఉండాలనుకోవడం వర్మ ప్రత్యేకత. సినిమాల్లోకి రాకముందు నుంచి ఆయన ప్రవర్తన అలాగే ఉంటారు. ఎవరి ఇష్టం వారిది. ఒకరిని ప్రశ్నించే హక్కు ఎవరికీ లేదు.

సినిమా పరిశ్రమలో నన్ను తొక్కేసేంత టాలెంట్ ఎవరికీ లేదు. ఒకవేళ నన్ను ఎవరైనా తొక్కాలనుకుంటే వారి కాళ్లే నొప్పిపుడుతాయి. వారి తరం కాదు. సినీ పరిశ్రమలో ఒకరిని మరొకరు తొక్కేస్తారని అనుకోవడం తప్పేనని ఆయన అన్నారు. గాడ్ ఫాదర్ అనేది చెప్పుకోవడానికే బాగుంటుంది. ప్రతిభ లేకుండా ఒకరిని బాగుచేయాలని అనుకోవడం కష్టమే అవుతుంది.

పవన్ కల్యాణ్ పార్టీ పెట్టడమనేది ఆయన వ్యక్తిగత అభిప్రాయం. పార్టీలోకి పిలిస్తే అనే విషయం ఊహాజనితమైంది. ఒకవేళ ఆయన ఆహ్వానిస్తే అప్పుడు చూస్తాను. భవిష్యత్ గురించి ఊహలు పెంచుకోవడం నాకు నచ్చదు అని బెనర్జీ చెప్పారు.