4 బంతుల్లో 92 పరుగులు!

0Dhaka-Second-Division-Leaguఒక ఓవర్లో 36 పరుగులు కొట్టడం చూశాం. కానీ 4 బంతుల్లో 92 పరుగులు ఏమిటని ఆశ్చర్యపోతున్నారా.. ఇది నిజం. బంగ్లాదేశ్‌ దేశవాళీ క్రికెట్‌ టోర్నమెంట్లో ఓ జట్టు కేవలం 4 బంతుల్లో 92 పరుగులు ఇచ్చి ఘోర ఓటమిని మూటకట్టుకుంది. మంగళవారం జరిగిన ఢాకా సెకండ్‌ డివిజన్‌ లీగ్‌ 50 ఓవర్ల మ్యాచ్‌లో లాల్‌మతియా క్లబ్‌, ఆక్సియామ్‌ గ్రూప్‌లు తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన లాల్‌మతియా 14 ఓవర్లలో 88 పరుగులకు ఆలౌట్‌ అయింది. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన ఆక్సియామ్‌ జట్టు కేవలం నాలుగు బంతుల్లోనే 92 పరుగులు చేసి 10 వికెట్లతో విజయం సాధించింది.

లాల్‌మతియా జట్టు ఓపెనింగ్‌ బౌలర్‌ సుజోన్‌ మహ్ముద్‌ తొలి ఓవర్లోనే వరుసగా 13 వైడ్‌లు, 3 నోబాల్స్‌ వేయగా ఇవన్నీ బౌండరీ దాటాయి. దీంతో జట్టు ఒక్క బంతి కూడా ఎదుర్కోకుండానే 80 పరుగులు చేసింది. ఆక్సియామ్‌ ఓపెనర్‌ ముస్తాఫిజుర్‌ రెహమన్‌ ఆ తర్వాతి మూడు బంతులను కూడా బౌండరీకి తరలించాడు. దీంతో జట్టు కేవలం 4 బంతులు ఎదుర్కొని 92 పరుగులు చేసింది. పూర్‌ అంపైరింగ్‌ వలనే ఇలా జరిగిందని లాల్‌మతియా జట్టు ఆరోపించింది. ఈ మ్యాచ్‌పై వివరణ కోరామని, రిపోర్టు అందిన వెంటనే విచారణ జరుపుతామని బంగ్లాదేశ్‌ క్రికెట్‌ బోర్డు తెలిపింది.