షాకింగ్: బ్యాంకు`లోను`క్యాస్టింగ్ కౌచ్!

0చాలామంది హీరోయిన్లు – సెలబ్రిటీలపై హాలీవుడ్ నిర్మాత హార్వీ వీన్ స్టీన్ లైంగిక వేధింపులు – అత్యాచారాల నేపథ్యంలో `# మీ టూ` ఉద్యమం వెల్లువెత్తిన సంగతి తెలిసిందే. కేవలం సినిమా రంగంలోనే కాదని – ఐటీ కంపెనీలతో సహా దాదాపుగా మహిళలు పనిచేసే ప్రతిచోట ఈ క్యాస్టింగ్ కౌచ్ వ్యవహారం నడుస్తోందని మహిళా లోకం గళం విప్పింది. హాలీవుడ్ లో మొదలైన క్యాస్టింగ్ కౌచ్ వ్యవహారం కొంతకాలంగా టాలీవుడ్ నూ కుదిపేస్తోన్న విషయం విదితమే. అయితే తాజాగా బ్యాంకుల్లో కూడా క్యాస్టింగ్ కౌచ్ వ్యవహారం బట్టబయలు కావడం తీవ్ర కలకలం రేపింది. క్రాప్ లోన్ కోసం బ్యాంకుకు వచ్చిన ఓ మహిళకు ఆ బ్యాంకు మేనేజర్ నుంచి `క్యాస్టింగ్ కౌచ్` ఎదురవడం పెను దుమారం రేపింది. అయితే ఆ మహిళ చాకచక్యంగా వ్యవహరించి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఆ కామాంధుడి గుట్టురట్టయింది. ప్రస్తుతం ఆ బ్యాంకు మేనేజరుతో పాటు – ప్యూన్ కూడా పరారీలో ఉన్నారు. మహిళ ఫిర్యాదు ప్రకారం కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.

మహారాష్ట్రలోని బుల్దానా జిల్లాలో ఉన్న మలకాపూర్ లోని సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో క్రాప్ లోన్ కోసం దరఖాస్తు చేసుకునేందుకు ఓ రైతుతో పాటు అతడి భార్య కూడా వెళ్లింది. తమకు లోన్ మంజూరు చేయాల్సిందిగా వారు బ్రాంచ్ మేనేజర్ రాజేష్ హివాసేను సంప్రదించారు. దరఖాస్తు పూర్తిచేసే నెపంతో ఆ మహిళ నెంబరును రాజేష్ తీసుకున్నాడు. ఆ తర్వాత ఆమెకు ఫోన్ చేసి అసభ్యకరంగా మాట్లాడుతూ – తన లైంగిక వాంఛ తీరిస్తే లోన్ మంజూరు చేస్తానని ఆఫర్ ఇచ్చాడు. ఆ తర్వాత – తన బ్యాంకులో పనిచేసే ప్యూన్ ను ఆ మహిళ ఇంటికి పంపించి రాయబారం నడిపాడు. రాజేష్ కోరిక తీరిస్తే బ్యాంకు లోన్ తో పాటు స్పెషల్ ప్యాకేజీ ఇస్తారని ఆశచూపాడు. బ్యాంకు మేనేజర్ ఫోన్ సంభాషణను రికార్డు చేసిన ఆ మహిళ….అదే రోజు సాయంత్రం పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో – బ్యాంకు మేనేజర్ రాజేష్ – ప్యూన్ లపై పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రస్తుతం పరారీలో ఉన్న వారిద్దరి కోసం పోలీసులు గాలిస్తున్నారు.