అమితాబ్ యాడ్ పై వివాదం

0బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ ఓ వివాదంలో చిక్కుకున్నారు. ఆయన నటించిన ఓ ప్రకటన వివాదాస్పదమైంది. తెలుగులో అక్కినేని నాగార్జున ప్రచారం చేసే కళ్యాణ్ జువెలర్స్ కు హిందీలో బిగ్-బి ప్రచారం చేస్తారన్న సంగతి తెలిసిందే. ఐతే ఆ జువెలరీ బ్రాండ్ మీద ఇటీవల కొన్ని ఆరోపణలు వచ్చాయి. దుబాయ్లోని కళ్యాణ్ జువెలర్స్ షోరూంలో నకిలీ బంగారం అమ్మినట్లుగా ఆరోపణలు వచ్చాయి. ఇది ఆ సంస్థ ఇమేజ్ను బాగా డ్యామేజ్ చేసింది. ఈ నేపథ్యంలో ఈ ప్రచారాన్ని ఖండించేందుకు కళ్యాణ్ జువెలర్స్ ఒక కొత్త ప్రకటన రూపొందించింది. తమ క్రెడిబిలిటీ ఎలాంటిదో చాటి చెప్పేందుకు ప్రయత్నం చేసింది. ఈ ప్రకటనలో అమితాబ్తో పాటు ఆయన తనయురాలైన శ్వేత నందా నటించారు.

ఈ ప్రకటనలో భాగంగా అమితాబ్ – ఆయన తనయురాలు ఒక బ్యాంకుకు వెళ్తారు. తన పెన్షన్ అమౌంట్ రెండుసార్లు తన బ్యాంక్ అకౌంటులో క్రెడిట్ అయిందంటూ అమితాబ్ బ్యాంకు సిబ్బందికి చెబుతాడు. అందుకు బదులుగా బ్యాంకు సిబ్బంది.. ఈ విషయం బయటికి చెప్పకుండా డబ్బులు అలాగే ఉంచేసుకోమని సలహా ఇస్తారు. దీనికి అమితాబ్ అంగీకరించరు. కళ్యాణ్ జువెలర్స్ వాళ్లు కూడా ఇంత నిజాయితీగా ఉంటారంటూ చాటిచెబుతూ ఈ యాడ్ ముగుస్తుంది. ఐతే కళ్యాణ్ జువెలర్స్ గురించి గొప్పలు పోయే క్రమంలో బ్యాంకు సిబ్బందిని తప్పుగా చూపించారంటూ గొడవ మొదలైంది. బ్యాంకింగ్ యూనియన్ దీనిపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. వెంటనే ఈ ప్రకటనను తీసేయాలని డిమాండ్ చేసింది. దీనిపై కళ్యాణ్ జువెలర్స్ సంస్థ కూడా స్పందించింది. ప్రకటనలో మార్పులు చేస్తామని పేర్కొంది