ఉలిక్కిపడే మాట చెప్పిన రిజర్వ్ బ్యాంక్

0ఆసక్తికరమైన విషయాన్ని వెల్లడించింది రిజర్వ్ బ్యాంక్. పేరుకు సేవా రంగమన్నట్లుగా కలర్ ఇచ్చినా.. పక్కా వ్యాపారంగా చేసే బ్యాంకింగ్ రంగం తీరుపై ఇప్పటికే ప్రజల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. సామాన్యుడి విషయంలో కఠిన నిబంధనల్ని కత్తి పట్టుకున్న చందంగా అమలు చేసే బ్యాంకులు.. పెద్దోళ్ల విషయంలో ఉదారంగా వ్యవహరించటం కనిపిస్తుంది. వేలాది కోట్ల రూపాయిల్ని బడా బాబులకు అప్పనంగా ఇచ్చేసే బ్యాంకుల కారణంగా ఆయా బ్యాంకులు ఆర్థికంగా ఎన్ని అవస్థలకు గురి అవుతున్నాయో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరమే ఉండదు.

మొండి బాకీల పేరుతో ఏటా వేలాది కోట్ల రూపాయిల్ని బ్యాలెన్స్ షీట్లలో చూపించే బ్యాంకులు.. దాని వెనుక బ్యాంకింగ్ సిబ్బంది పాపమే ఎక్కువని చెప్పక తప్పదు.

సామాన్యుడి విషయంలో ఎంత కఠినంగా వ్యవహరిస్తారో అంతే కఠినంగా బడాబాబులు.. కార్పొరేట్ కంపెనీల విషయంలోనూ అదే తీరును ప్రదర్శిస్తే మొండి బకాయిల బరువు తగ్గటం ఖాయం. కానీ.. ఆ పని చేయని బ్యాంకులు తమ ఖర్చుల్ని తగ్గించుకోవటం అనుసరిస్తున్న వైనం అవాక్కు అయ్యేలా చేస్తోంది. తాజాగా ఆ విషయాన్ని వెల్లడించింది ఆర్ బీఐ.

గడిచిన పది నెలల్లో దేశ వ్యాప్తంగా వేర్వేరు ప్రదేశాల్లో ఉన్న ఏటీఎంలలో పదివేల ఏటీఎంలను బ్యాంకులు మూసివేసిన వైనాన్ని వెల్లడించింది. 2017 మే నుంచి 2018 ఫిబ్రవరి మధ్య కాలంలో ఈ మూసివేత చోటు చేసుకున్నట్లు ప్రకటించింది. 2017 మే నాటికి దేశ వ్యాప్తంగా 110116 ఏటీఎంలు ప్రజలకు అందుబాటులో ఉండగా.. 2018 ఫిబ్రవరి నాటికి వాటి సంఖ్య 107630కు తగ్గిపోయినట్లుగా తన తాజా నివేదికలో పేర్కొంది.

మూసివేతకు గురైన ఏటీఎంలలో అత్యధికం ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన ఎస్ బీఐది కావటం గమనార్హం. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏటీఎంల సంఖ్య అంతకంతకూ పెంచాల్సింది పోయి.. తగ్గించటం ఎందుకు? అన్న క్వశ్చన్ కు ఆన్సర్ వెతికితే అవాక్కు అవ్వాల్సిందే. ఏటీఎం నిర్వహణ భారీ ఖర్చుగా మారిందని.. అందుకే వాటిని మూసి వేయటం ద్వారా ఖర్చు తగ్గించుకోవాలని బ్యాంకులు భావిస్తున్నట్లు చెబుతోంది.

గడిచిన పది నెలల్లో బ్యాంక్ ఆఫ్ ఇండియా 108 ఆన్ సైట్.. 100 ఆఫ్ సైట్ ఎటీఎంలను మూసివేస్తే.. కెనరా బ్యాంకు.. సెంట్రల్ బ్యాంకు.. పంజాబ్ నేషనల్ బ్యాంకులు కూడా పెద్ద సంఖ్యలో తమ ఏటీఎంలను మూసేస్తున్నాయి. ఇప్పటికే వెలుగు చూస్తున్న కుంభకోనాలు.. బ్యాంకు ఉన్నతాధికారుల నిర్వాకాలతో బ్యాంకుల మీద ప్రజలు నమ్మకం కోల్పోతున్న పరిస్థితి. ఇలాంటివేళ.. ఖర్చుల్లో కోతల్లో భాగంగా ఏటీఎంలను అంతకంతకూ తగ్గించటం అంటే.. బ్యాంకుల్లో దాచి పెట్టుకునే నగదు మీద ప్రభావం చూపటం ఖాయమన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. అదే నిజమైతే.. బ్యాంకులకు మరో కొత్త సమస్య మీద పడే ప్రమాదం ఉందని చెప్పక తప్పదు.