ఈ సారి ఐటమ్ సాంగ్ కాదు హీరోయినే..!

0Bellamkonda-srinivas-and-tamannaఇండస్ట్రీలో మరే హీరోకి సాధ్యం కాని రేంజ్లో భారీగా వెండితెరకు పరిచయం అయిన యంగ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్. తొలి సినిమా అల్లుడు శీనుతో సక్సెస్ సాధించలేకపోయినా, స్టార్ హీరోల స్థాయిలో గుర్తింపు తెచ్చుకోగలిగాడు ఈ యంగ్ హీరో. అదే జోరులో ఇప్పుడు తన రెండో సినిమా స్పీడున్నోడును రిలీజ్కు రెడీ చేస్తున్నాడు. రీమేక్ స్పెషలిస్ట్ భీమినేని శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో సోనారిక హీరోయిన్గా నటిస్తోంది.

బెల్లంకొండ సాయి శ్రీనివాస్ నటించిన రెండు సినిమాల్లో కథా కథనాలు, సాంకేతిక నిపుణుల సంగతి ఎలా ఉన్నా ఈ రెండు సినిమాలకు ఓ కామన్ పాయింట్ ఉంది. అదే ఐటమ్ సాంగ్. ఈ రెండు సినిమాల్లోనూ స్టార్ హీరోయిన్ తమన్నా ఐటమ్ సాంగ్ చేయటం విశేషం. అయితే తన మూడో సినిమాలోనూ మరోసారి తమన్నాతో కలిసి చిందేయడానికి రెడీ అవుతున్నాడు శ్రీనివాస్. ఈ సారి మాత్రం ఐటమ్ నంబర్లో కాదట.

తన మూడో సినిమాలో తమన్నాను హీరోయిన్గా ఫైనల్ చేసినట్టుగా ప్రకటించాడు బెల్లం కొండ సాయి శ్రీనివాస్. రొమాంటిక్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ సినిమాకు దర్శకుడు ఎవరన్నా విషయం మాత్రం ప్రకటించలేదు. ఇప్పటికే బోయపాటి శ్రీనుతో ఓ సినిమా చేయడానికి కమిట్ అయిన శ్రీనివాస్, ఆ సినిమాకే తమన్నాను ఎంపిక చేశారా లేక, మరో దర్శకుడితో సినిమా చేయబోతున్నాడా అన్న విషయంపై కూడా క్లారిటీ ఇవ్వలేదు.