సాక్ష్యం.. మినీ బాహుబలి

0వేసవి సినిమాల సందడి ముగిశాక.. భారీతనం ఉన్న చిత్రాలేవీ విడుదల కాలేదు తెలుగులో. ఈ వారం రాబోయే ‘సాక్ష్యం’ మాత్రం చాలా గ్రాండ్ గా కనిపిస్తోంది. హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ రేంజికి మించి చాలా ఖర్చు పెట్టారు ఈ చిత్రంపై. దీని టీజర్.. ట్రైలర్ చూస్తే ఆ భారీతనమంతా కనిపించింది. దీన్ని శ్రీనివాస్ ‘మినీ బాహుబలి’గా అభివర్ణించడం విశేషం. తారాగణం.. లొకేషన్లు.. విజువల్ ఎఫెక్ట్స్.. ఇలా అన్నింట్లోనూ ‘సాక్ష్యం’లో భారీతనం కనిపిస్తుందని.. అందుకే దీన్ని తాము ‘మినీ బాహుబలి’గా భావిస్తున్నామని శ్రీనివాస్ చెప్పాడు.

పంచ భూతాల నేపథ్యంలో దర్శకుడు శ్రీవాస్ అద్భుతమైన కథ రాశాడని.. ఇలాంటి కథ ఇప్పటిదాకా ఎక్కడా రాలేదని.. ఆయన గొప్ప కథతో రావడంతో చిత్ర యూనిట్లోని అందరిలోనూ తెలియని ఎనర్జీ వచ్చిందని.. ఇంత గొప్ప కథకు న్యాయం చేయాలనే ఉద్దేశంతో అందరూ తమ శక్తికి మించి పని చేశామని శ్రీనివాస్ తెలిపాడు. పంచభూతాల్ని సూచించేలా పొల్లాచ్చి.. వారణాసి.. బళ్లారి.. ఇలా వేర్వేరు ప్రాంతాల్లో ఇప్పటిదాకా ఎవ్వరూ చేయనంత భారీ సన్నివేశాలు రూపొందించామని శ్రీనివాస్ చెప్పాడు. ఒక్కొక్క ఫైట్ తీయడానికి 15 రోజులు పట్టిందని.. అలాగని ఏవి కూడా ఓవర్ ద టాప్ ఉండవని.. భారీతనం ఉంటూనే సహజత్వం ఉట్టిపడేలా యాక్షన్ సన్నివేశాలు తీశామని అన్నాడు. ఒక సినిమాలో మెయిన్ విలన్ గా చేసే స్టేటస్ ఉన్న నలుగురు నటులు ఈ ఒక్క సినిమాలోనే విలన్లుగా నటించారని.. వాళ్లందరి పాత్రలూ అద్భుతంగా ఉంటాయని.. మిగతా క్యారెక్టర్లు కూడా అంతే అని.. ఈ సినిమాకు పని చేసిన ప్రతి ఒక్కరూ తాము ఒక బ్లాక్ బస్టర్ కు పని చేస్తున్నాం అనే భావనతోనే ముందు నుంచి పని చేశారని.. తమ అందరికీ ఇది మినీ బాహుబలి అని శ్రీనివాస్ చెప్పాడు.