బెల్లంకొండ బాబు.. బాలీవుడ్ లుక్

0బాడీలు పెంచాలన్నా.. సిక్స్ ప్యాక్ లు చేయాలన్నా బాలీవుడ్ వాళ్లకే చెల్లేది ఒకప్పుడు. కానీ ‘దేశముదురు’ సినిమాలో అల్లు అర్జున్ సిక్స్ ప్యాక్ చేసి ఈ విషయంలో సౌత్ ఇండియన్ హీరోలు కూడా తక్కువేమీ కాదని రుజువు చేశాడు. ఆ తర్వాత చాలామంది సౌత్ హీరోలు సిక్స్ ప్యాక్ లతో ఆకట్టుకున్నారు. ఐతే జస్ట్ సిక్స్ ప్యాక్ చేయడంలో ప్రత్యేకత ఏమీ కనిపించడం లేదు ఈ రోజుల్లో. బాలీవుడ్ హీరోలు సిక్స్ ప్యాకుల్ని మించి బాడీ బిల్డింగ్ లో వైవిధ్యం చూపిస్తున్నారు. కళ్లు చెదిరే రీతిలో బాడీల్ని బిల్డ్ చేస్తున్నారు. హృతిక్ రోషన్.. విద్యుత్ జమాల్ లాంటి వాళ్లను చూస్తే ఔరా అనాల్సిందే. మన సౌత్ హీరోలు కూడా వాళ్ల బాటలో సాగుతున్నారీ మధ్య.

తాజాగా టాలీవుడ్ యంగ్ హీరో బెల్లంకొండ శ్రీనివాస్.. ‘సాక్ష్యం’ సినిమా కోసం ఓ రేంజిలో బాడీ పెంచేశాడు. శుక్రవారం ఈ చిత్రం విడుదల కాబోతున్న నేపథ్యంలో ఈ చిత్రంలోని తన బేర్ బాడీ లుక్ ను సోషల్ మీడియాలో పంచుకున్నాడు శ్రీనివాస్. అది చూస్తే బాలీవుడ్ హీరోలకు మనోడు ఏమాత్రం తక్కువ కాదనిపిస్తోంది. కేవలం యాబ్స్ వరకే కాదు.. మిగతా బాడీ అంతా కూడా వావ్ అనిపించేలా పెంచాడు. ఇదంతా సినిమాకు అవసరమయ్యే చేశానంటున్నాడు శ్రీనివాస్. ‘సాక్ష్యం’ కోసం శ్రీనివాస్ ఫ్లై బోర్డింగ్.. జెట్ స్కైయింగ్.. శాండ్ బోర్డింగ్.. డెజెర్ట్ బైకింగ్.. ఏటీవీ రైడింగ్.. బీఏఎం సైక్లింగ్.. ఇలా చాలా విద్యలే నేర్చుకున్నాడు. చాలా రిస్క్ చేసి ఇవన్నీ నేర్చుకున్నాడు. యాక్షన్ సన్నివేశాల కోసం కూడా చాలానే కష్టపడ్డాడు శ్రీనివాస్. శ్రీవాస్ దర్శకత్వంలో అభిషేక్ నామా నిర్మించిన ‘సాక్ష్యం’లో శ్రీనివాస్ సరసన పూజా హెగ్డే నటించింది. రూ.40 కోట్ల భారీ బడ్జెట్లో ఈ చిత్రాన్ని నిర్మించారు. అందుకు తగ్గట్లే బిజినెస్ చేసిన ఈ చిత్రం.. మంచి అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకొస్తోంది.