కారు ప్రమాదంలో మోడల్‌ మృతి, బిక్రమ్‌కి గాయాలు

0Sonika-Chauhanటాప్‌ మోడల్‌, యాంకర్‌, నటి సోనికా చౌహాన్‌ ఘోర రోడ్డు ప్రమాదంలో మృతి చెందింది. ఆమె స్నేహితుడు, బెంగాలీ యువ నటుడు బిక్రమ్‌ ఛటోపాధ్యాయతో కలిసి కారులో వెళుతుండగా శనివారం ఉదయం లాకేమాల్‌ సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. కారు అదుపు తప్పి డివైడర్‌ను ఢీకొని అనంతరం పేవ్‌మెంట్‌ ఎక్కేసింది. ఈ విషయాన్ని గమనించిన స్థానికులు కారులో చిక్కుకున్న బిక్రమ్‌, సోనికాను హుటాహుటీన సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే సోనికా మృతి చెందినట్లు వైద్యులు వెల్లడించారు. తలకు తీవ్రంగా గాయమైన బిక్రమ్‌కు వైద్యులు ఐసీయూలో చికిత్స అందిస్తున్నారు.

కాగా ప్రమాదానికి గురైన టయోటా కారు పూర్తిగా ధ్వంసం అయింది. అయితే ప్రమాదం జరిగినప్పుడు బిక్రమ్‌ కారును అత్యంత వేగంగా నడుపుతున్నట్లు సమాచారం. అలాగే కారులో ఎయిర్‌ బ్యాగ్స్‌ కూడా పని చేయలేదని తెలుస్తోంది. మరోవైపు పోలీసులు కేసు నమోదు చేసుకుని, ఆధారాల కోసం ప్రమాదం జరిగిన ప్రదేశంలోని సీసీ టీవీ పుటేజ్‌ను పరిశీలిస్తున్నారు. సోనికా చౌహాన్‌ మృతి పట్ల పలువురు బెంగాలీ నటులు సంతాపం తెలిపారు. కాగా బిక్రమ్‌ బెడ్రూమ్‌, మిస్టేక్‌, అమీ ఔర్‌ అమర్‌ గాళ్‌ఫ్రెండ్స్‌తో పాటు పలు బెంగాలీ చిత్రాల్లో హీరోగా నటించాడు.