భరత్ యాక్సిడెంట్‌లో ఆ ముగ్గురు ఎవరు?

0ravi-teja-brother-bharatసినీ నటుడు రవితేజ సోదరుడు భరత్ రోడ్డు ప్రమాద ఘటనకు సంబంధించిన వ్యవహారంలో ఆసక్తికరమైన విషయాలు చర్చలోకి వస్తున్నాయి. ఈ దుర్ఘటనలో అనేక సందేహాలు, అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. భరత్ మద్యం మత్తులో డ్రైవింగ్‌లోకి జారుకున్నారా? నిద్రలోకి జారుకోవడం వల్ల ప్రమాదం జరిగిందా? కారులో ఆయనతోపాటు ఎవరు ప్రయాణిస్తున్నారు? వారెందుకు భరత్‌ను వదిలేసి వెళ్లిపోయారు? కుటుంబ సభ్యులకు సమాచారం ఎందుకు అందించలేదు? అనే ప్రశ్నలు లేస్తున్నాయి. శనివారం అర్ధరాత్రి ఔటర్ రింగ్ రోడ్డులో జరిగిన ప్రమాదంలో రవితేజ సోదరుడు భరత్ మ‌ృత్యువాత పడిన సంగతి తెలిసిందే.

శంషాబాద్‌లోని నోవాటెల్ హోట‌ల్ నుంచి భరత్ బయలుదేరినట్టు పోలీసులు వెల్లడించారు. అక్కడి నుంచి బయలుదేరిన అర్ధగంటలోపే భరత్ యాక్సిడెంట్‌కు గురయ్యాడు. ప్రమాద సమయంలో భరత్ వెంట కొందరు సినీ పరిశ్రమకు చెందిన వ్యక్తులు ఉన్నట్టు సమాచారం. కారులో ఉన్నది ఎవరు? వారికి గాయాలయ్యాయా? అయితే వారెక్కడ ఉన్నారు? వారు బయటపడకపోవడం వెనుక బలమైన కారణమేమిటి? అనే అనేక అనుమానాలకు దారి తీస్తున్నాయి.

మరణానికి ముందు భరత్‌ది అదుపుతప్పిన జీవితం అనేది అందరికీ తెలిసిందే. ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్ లేకుండా పరిశ్రమలో స్టార్ హీరోగా మారిన రవితేజ్‌ ప్రతిష్ఠకు భంగం కలిగించేలా వ్యవహరించాడన్నది అందరికి తెలిసిందే. డ్రగ్స్ కేసులో పట్టుబట్టాడు. డ్రంక్ అండ్ డ్రైవ్ వ్యవహారంలో పోలీసులు, మీడియాపై దురుసుగా ప్రవర్తించాడు.

ఈ నేపథ్యంలో ప్రమాదానికి ముందు భరత్, ఎవరిని కలిశాడు. ఎవరితో అర్ధరాత్రి వరకు ఉన్నాడు. ఏ స్థితిలో వస్తున్నారు? ఇలాంటి విషయాలు బయటపడుతాయనే ఉద్దేశంతోనే భరత్ మిత్రులు గుట్టుచప్పుడు కాకుండా ఉన్నారా? అనే వాదన వ్యక్తమవుతున్నది.

నేర పరిశోధనకు ప్రస్తుతం అందుబాటులో ఉన్న సాంకేతికత బాగా ఉపయోగపడుతున్నది. పోలీసుల ప్రాథమిక విచారణలో నోవాటెల్ నుంచి భరత్ బయలుదేరేటప్పుడు కారులో మరో ముగ్గురు ఉన్నారన్న విషయం తేలింది. అయితే వారు మధ్యలోనే దిగిపోయారా? లేక వారు ఏమైపోయారు? ఆ ముగ్గురు ఎవరు అనే కీలకమైన ప్రశ్నగా మారింది.

కారు ప్రమాదం జరిగిన పరిస్థితిని బట్టి చూస్తే కారులో మరెవరు ఉన్నా బతికే పరిస్థితి కనిపించడం లేదు. ఒకవేళ బతికిన తీవ్ర గాయాలయ్యే పరిస్థితి ఉంది. ఈ ఘటనలో ఆ ముగ్గురు ఎవరు. వారు మధ్యలో ఎక్కడ దిగిపోయారు అనేవి ముఖ్యమైన ప్రశ్నలుగా మారాయి.