జగన్‌కు బుద్ధి చెప్పాలి: అఖిల సంచలనం

0Jagan-and-Akhila-priyaవైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డిపై మంత్రి భూమా అఖిలప్రియ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. నంద్యాల ఉప ఎన్నికల్లో ఓటమి భయంతోనే టీడీపీపై అడ్డగోలు ఆరోపణలు చేస్తున్నారని ఆరోపించారు. నంద్యాల పద్మావతి నగర్‌లోని టీడీపీ కార్యాలయంలో ఆమె మీడియాతో మాట్లాడారు.

వైయస్ అధికారంలో ఉన్నప్పుడు అధికార బలంతో వ్యవస్థలను పతనం చేసిన విషయం ప్రజలందరికీ తెలుసునని అఖిలప్రియ అన్నారు. అధికారంలో లేకపోయినా అహంకారంతో వ్యవహరిస్తున్న వైయస్ జగన్, ఆయన అనుచరుల తీరుతో ప్రజల్లో భయాందోళనలు నెలకొన్నాయని విమర్శించారు.

అహంకారంతో వ్యవహరిస్తున్న జగన్ పార్టీ అధికారంలోకి వస్తే తాము రోడ్ల మీద కూడా తిరగలేమన్న భయం ప్రజల్లో ఉందని అన్నారు. ఆ పార్టీకి ఎట్టి పరిస్థితుల్లో అధికారం ఇవ్వకూడదనే నంద్యాల నియోజకవర్గం ప్రజలు నిశ్చయించుకున్నారని అఖిలప్రియ తెలిపారు.

జగన్మోహన్ రెడ్డికి బుద్ధి చెప్పే సరైన సమయం ఇదేనని అఖిలప్రియ అన్నారు. జలయజ్ఞాన్ని ధన యజ్ఞం చేసి ప్రాజెక్టులు కట్టకుండా మట్టి పనుల ద్వారా వైయస్ రూ.వేల కోట్లు దండుకున్న వైనం ప్రజలందరికీ తెలుసునని అఖిలప్రియ చెప్పారు.

సాగునీటి ప్రాజెక్టులు సకాలంలో పూర్తి చేసి వెనుకబడిన రాయలసీమను సస్యశ్యామలం చేసేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సర్వశక్తులు ఒడ్డుతున్నందుకు ప్రజలు ఆయనకు జేజేలు పలుకుతున్నారని అఖిలప్రియ అన్నారు. గత కాంగ్రెస్ పాలనతో ప్రజలు నిరాశ చెందారని, ప్రస్తుతం చంద్రబాబు ప్రభుత్వంతో ఉపాధి కల్పన, పరిశ్రమలు రావడం వల్ల యువత ఆయనకు మద్దతు పలుకుతున్నారని అన్నారు.

గోదావరి నీటిని పట్టిసీమ ద్వారా కృష్ణా డెల్టాకు అందించి, కృష్ణా నీటిలో ఏపీ వాటాను సీమకు తరలించాలని దృఢ సంకల్పంతో చంద్రబాబు ఉన్నారని, అందుకే చంద్రబాబును ప్రజలు ఆదరిస్తున్నారని అఖిలప్రియ చెప్పారు. ఓటమి భయంలో ఉన్న జగన్ పార్టీ.. డబ్బుల సంచులతో గెలుపుకోసం అడ్డదారులు తొక్కుతోందని అఖిలప్రియ సంచలన ఆరోపించారు.