భూమా నాగిరెడ్డి కన్నుమూత

0Bhuma-Nagi-Reddy-Dies-Of-Heart attackకర్నూలు జిల్లా నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి(53) కన్నుమూశారు. ఈరోజు ఉదయం ఆయన పేపర్‌ చదువుతుండగా ఒక్కసారిగా గుండెపోటుకు గురయ్యారు. ఆ సమయంలో ఆయన పక్కనే ఉన్న కుమార్తె, ఆళ్లగడ్డ ఎమ్మెల్యే అఖిల ప్రియ ఆయన్ని హుటాహుటిన ఆళ్లగడ్డ ఆస్పత్రికి తరలించారు. మెరుగైన చికిత్స నిమిత్తం అక్కడి నుంచి నంద్యాలలోని సురక్ష ఆస్పత్రికి తరలించారు. అక్కడ వైద్యులు వెంటిలేటర్‌పై ఉంచి అత్యవసర వైద్య సేవలు అందించారు. అయితే చికిత్సకు ఆయన శరీరం సహకరించలేదు. దీంతో అధికారులు ఆయన్ని ఎయిర్‌ అంబులెన్స్‌లో హైదరాబాద్‌కు తరలించేందుకు ప్రయత్నించారు. ఆ సమయంలోనే పరిస్థితి విషమించి ఆయన తుదిశ్వాస విడిచినట్లుగా వైద్యులు ప్రకటించారు. భూమా నాగిరెడ్డికి ఇద్దరు కుమార్తెలు, ఓ కుమారుడు ఉన్నారు. మూడేళ్ల క్రితం జరిగిన రోడ్డుప్రమాదంలో ఆయన భార్య శోభా నాగిరెడ్డి మృతిచెందారు. భూమా నాగిరెడ్డి అకాల మృతితో ఆయన కుటుంబసభ్యులు, పార్టీ నేతలు, అనుచరులు, అభిమానులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు.

భూమా నాగిరెడ్డికి గతంలో గుండెపోటు రావడంతో బైపాస్‌ సర్జరీ నిర్వహించారు. వారం రోజుల క్రితం మరోసారి గుండెపోటు రావడంతో హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో ఆయన చికిత్స తీసుకున్నారు. దీంతో కాస్త కోలుకున్న ఆయన నిన్న విజయవాడలో ముఖ్యమంత్రి చంద్రబాబుతో భేటీ అయ్యారు. ఈ సమయంలో భూమా ఆరోగ్యంపై చంద్రబాబు ఆరా తీశారు. ఎలాంటి ఆందోళన చెందొద్దని.. ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టాలని చంద్రబాబు ఆయనకు సూచించారు. అనంతరం విజయవాడ నుంచి నిన్న రాత్రి ఇంటికి చేరుకుని విశ్రాంతి తీసుకున్నారు.ఆరోగ్యం మెరుగుపడుతుందనుకుంటున్న తరుణంలో భూమా మృతిచెందడంతో అందరూ విషాదంలో ముగినిపోయారు.

ఉదయం భూమా నాగిరెడ్డికి గుండెపోటు వచ్చినట్లు తెలుసుకున్న చంద్రబాబు కర్నూలు జిల్లా కలెక్టర్‌, వైద్యులతో మాట్లాడి ఆయన పరిస్థితి అడిగి తెలుసుకున్నారు. మెరుగైన చికిత్స నిమిత్తం భూమాను హెలికాప్టర్‌లో హైదరాబాద్‌కు తరలించాలని ఆదేశించారు. భూమా కుమార్తె అఖిలప్రియతో మాట్లాడి ఆమెను ఓదార్చారు. ధైర్యంగా ఉండాలని సూచించారు.