ఎన్టీఆర్ హిట్ చలవ..నానికి ఫ్లాప్ వరద..

0బిగ్ బాస్ మొదటి సీజన్ ను ఎన్టీఆర్ హోస్ట్ గా ఫుణెలో ఘనంగా నిర్వహించారు. ఈ తొలి తెలుగు రియాలిటీ షో హిట్ అవుతుందో లేదోనన్న భయం నిర్వాహకులను వెంటాడింది. ఈ భయాల నడుమ కేవలం 70రోజులకే పరిమితం చేసి ఈ షోను మొదలు పెట్టారు. కానీ గ్రాండ్ హిట్ అయ్యింది. ఎన్టీఆర్ తన యాంకరింగ్ తో షోను పీక్ స్టేజ్ కి తీసుకెళ్లిపోయాడు. రేటింగ్ విపరీతంగా వచ్చింది. దీంతో చాలా కొత్త సినిమాల మేకర్స్ బిగ్ బాస్ పాపులారిటీని క్యాష్ చేసుకోవాలని తమ సినిమాలను హౌస్ ద్వారా ప్రమోట్ చేశారు.

బిగ్ బాస్ సీజన్ 1లో ప్రమోట్ చేసిన సినిమాల్లో దాదాపు 90శాతం మూవీలు గ్రాండ్ హిట్ అయ్యాయి. మొదట నేనే రాజు నేనే మంత్రి సినిమా ప్రచారం కోసం రానా బిగ్ బాస్ ఇంటిలోకి వెళ్లి సందడి చేశాడు. ఆ తర్వాత ఆనందోబ్రహ్మ కోసం తాప్సి – అర్జున్ రెడ్డి మూవీ కోసం విజయ్ దేవరకొండ బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లారు. ఇక హోస్ట్ ఎన్టీఆర్ కూడా తన ‘జైలవకుశ’ సినిమాను అన్న కళ్యాణ్ రామ్ తో కలిసి ప్రమోషన్ చేశారు. ఈ అన్ని సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్ అయ్యాయి. మేడ మీద అబ్బాయి – ఉంగరాల రాంబాబు చిత్రాలు మాత్రం ఫ్లాప్ అయ్యాయి..

ఇక రెండో సీజన్ కు వచ్చేసరికి ట్రైన్ రివర్స్ అయ్యింది. బిగ్ బాస్ 2 పేలవంగా మొదలైంది.. నాని యాంకరింగ్ పై చాలా మంది పెదవి విరిశారు. కానీ తర్వాత నాని తనదైన మార్క్ హోస్టింగ్ తో బిగ్ బాస్ 2ను పట్టాలెక్కించాడు. ఇప్పుడు ది బెస్ట్ పర్ ఫామెన్స్ ఇస్తున్నాడు. ఇక బిగ్ బాస్ సీజన్ 2లో ప్రమోట్ చేసిన సినిమాలన్నీ ఇప్పటివరకూ అన్నీ ఫ్లాపే.. చెప్పుకోవడానికి ఒక్క హిట్ కూడా దక్కలేదు. మొదట జంబలకిడి పంబ సినిమా కోసం శ్రీనివాస్ రెడ్డి బిగ్ బాస్ లోకి వచ్చాడు. ఆ తర్వాత తేజ్ ఐలవ్ యు సినిమా కోసం సాయిధరమ్-అనుపమ ఎంట్రీ ఇచ్చారు. తాజాగా వైఫ్ ఆఫ్ రామ్ కోసం మంచు లక్ష్మి కూడా హౌస్ లో సందడి చేసింది. ఈ మూడు సినిమాలు పెద్దగా ఆడలేదు.

ఇలా ఈ 6వారాల్లో బిగ్ బాస్ చలవతో ఒక్క సక్సెస్ కూడా టాలీవుడ్ కు దక్కలేదు. దీంతో మున్ముందు బిగ్ బాస్ 2 హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చేందుకు హీరోలు వెనుకాడే ప్రమాదం ఉంది.