బిగ్ బాస్ లో వాళ్ల కంటే పిల్లలే సో బెటరేమో!

0బిగ్ బాస్ 2లో సాగుతున్న తీరు పలువురికి చిరాగ్గా మారుతోంది. పిల్లల కంటే అధ్వానంగా చిన్న విషయాలకు రచ్చ చేసుకోవటం.. బలమైన కంటెస్టెంట్ను ఏదోలా బయటకు పంపాలన్నట్లుగా వ్యవహరించటం.. తర్కం పేరుతో వాదిస్తూ.. హౌస్ లో హీట్ జనరేట్ చేసేలా చేస్తున్న వైనం ఇప్పుడు సరికొత్త రచ్చకు కారణమైంది. చాలా చిన్న మాట.. సింఫుల్ గా పోయే మాటను లాగి.. పీకితే ఏమైనా జరగొచ్చన్న విషయాన్ని చేతల్లో చేసి చూపించారు బిగ్ బాస్ హౌస్ మేట్స్.

శుక్రవారం టెలికాస్ట్ అయిన ఎపిసోడ్ చూస్తే.. ఈ విషయం ఇట్టే అర్థం కావటమే కాదు.. హౌస్ లో వాతావరణం పూర్తిగా మారే పరిణామాలు చోటు చేసుకుంది. ఈ వారం లగ్జరీ బడ్జెట్ టాస్క్ లో భాగంగా హౌజ్ మేట్స్ మూడు టీమ్స్ గా విడిపోయి ఆడాలని బిగ్ బాస్ ఆదేశించాడు. ఈ టాస్క్ లో కౌశల్.. దీప్తి..నందిని టీం గెలిచారు.

విజయానికి కానుకగా కొన్ని పుడ్ ఐటమ్స్ ను సభ్యులకు ఇచ్చారు. తమకు ఇచ్చిన వస్తువుల్ని మిగిలిన ఇంటి సభ్యులకు కూడా ఇవ్వొచ్చా అంటూ బిగ్ బాస్ ను అడగటం విన్నానని.. అది తనకు నచ్చలేదని కెప్టెన్ గా బాధ్యతలు తీసుకున్న గీతామాధురికి తనీష్ చెప్పాడు.

దీంతో.. ఈ విషయాన్ని తేల్చేసేందుకు ఇంటి సభ్యులందరికి ఒకచోట కూర్చొబెట్టిన గీతామాధురి సభాముఖంగా కౌశల్.. దీప్తి.. నందినిలను అడిగారు. దీప్తి.. నందినిలు తమకు ఎలాంటి అభ్యంతరం లేదని చెబితే.. కౌశల్ మాత్రం తమ టీం గెలిస్తే ఇంట్లోని సభ్యుల్లో ఇద్దరు తమ టీమ్కు కంగ్రాట్స్ చెప్పలేదంటూ విచిత్రమైన వాదనను తెర మీదకు తెచ్చారే కానీ.. అసలు విషయంపై మాత్రం రియాక్ట్ కాలేదు.

ఇంట్లో వారంతా చక్కగా ఉండాలని.. అందరం కలిగే లగ్జరీ బడ్జెట్ పంచుకోవాలని చెప్పాడు. కంగ్రాట్స్ చెప్పని సభ్యులెవరో చెప్పాలని గీత అడగ్గా.. ఒకరు బాబు గోగినేని చెబుతుండగా.. రెండో వ్యక్తి తానేనని తనీష్ చెప్పాడు. ఇదిలా జరుగుతుంటే.. బాబు గోగినేని ఇరిటేట్ అయి.. స్టాప్ దిస్ నాన్ సెన్స్ అనేశారు.

తాను కంగ్రాట్స్ చెప్పలేదు కాబట్టి.. తనకు లగ్జరీ బడ్జెట్ కింద వచ్చిన ఐటమ్స్ వద్దని చెప్పగా.. తమకు కూడా వద్దని తనీష్.. సామ్రాట్ లు చెప్పారు. నాన్ సెన్స్ పదాన్ని బాబు గోగినేని వాడటంతో గీత హర్ట్ అయ్యారు. కెప్టెన్ మీద గౌరవం ఉంటే.. కెప్టెన్ మాట్లాడుతున్నప్పుడు మధ్యలో ఎవరూ మాట్లాడకూడదంటూ హౌస్ మేట్స్ కు గీత చెప్పారు.

బాబు గోగినేని అన్న నాన్ సెన్స్ మాటను ప్రస్తావిస్తూ.. ఇక్కడ మాట్లాడేది నాన్ సెన్స్ కాదని.. భావోద్వేగంతో ఇష్టం వచ్చినట్లుగా ఒక మాట అనేసి జరిగే చర్చను పాడు చేయొద్దని కోరారు. తనకు నాన్ సెన్స్ అంటే తాను మాట్లాడతానని.. తన పేరు వచ్చాకే తాను మాట్లాడానంటూ బాబు తన కూల్ వైఖరికి భిన్నంగా చిన్న పిల్లాడి మాదిరి వాదించటం షురూ చేశారు.

గేమ్ లో ఒకరు గెలిచినప్పుడు ఇంట్లోని వారంతా వచ్చి కంగ్రాట్స్ చెబితే బాగుంటుందన్నదే తన ఉద్దేశంగా కౌశల్ చెప్పుకొచ్చారు. కంగ్రాట్స్ చెప్పలేదు కాబట్టి లగ్జరీ బడ్జెట్ ఐటమ్స్ వారికి ఇవ్వనని చెప్పటం బాగోలేదని.. గీత బలవంతం చేసి ఒప్పించినట్లుగా ఉందని.. అందుకే తనకు లగ్జరీ బడ్జెట్ ను తీసుకోవాలని లేదని తనీశ్ హౌస్ మేట్స్ కు చెప్పటం కనిపించింది.

ఇదిలా ఉంటే.. ఈ రచ్చలోకి సామ్రాట్ ఎంటరై.. టాస్క్ గెలిచిన తర్వాత తన దగ్గరకు వచ్చి నేషనల్ స్విమ్మర్ కదా అంటూ ఎగతాళిగా మాట్లాడరని.. అందుకే తనకు లగ్జరీ బడ్జెట్ వద్దని చెప్పాడు. అయితే.. తాను ఆ మాటను చాలా క్యాజువల్ గా అన్నానే తప్పించి.. తన మనసులో ఏమీ లేదని.. తప్పుగా అనిపిస్తే సారీ అని కౌశల్ చెప్పారు.

జరిగిన దానికి కారణంగా కొందరు నెగిటివ్ గా ఆలోచించటం వల్లనేమోనని.. పాజిటివ్ గా ఆలోచిస్తే అంతా మంచిగా ఉంటుందనిపిస్తుందని.. అందరూ అలా ఆలోచించాలని గీత చెబుతుండగా. బాబు గోగినేని.. తనీష్ లు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. మాటా.. మాటా పెరిగి చివరకూ కౌశల్ కూడా ఆగ్రహం వ్యక్తం చేయగా.. బెదిరిస్తున్నావా? అంటూ బాబు మరింత రివర్స్ కావటంతో వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది.

చివరకు అందరిని కంట్రోల్ చేసిన గీతా మాధురి గొడవ అప్పటికి సద్దుమణిగేలా చేశారు. మొత్తంగా చూస్తే.. బాబు గోగినేని తీరు చిన్న పిల్లాడిని తలపించేలా ఉందని.. ఆయన లాంటి మేధావి.. ఇలా మరిపోవటం ఏమిటంటూ పలువురు విస్మయానికి గురి అవుతున్నారు. మరోవైపు సోషల్ మీడియాలోనూ బాబు గోగినేని మీద నెగిటివ్ కామెంట్స్ వస్తున్నాయి. ఏంది బాబు.. మీరిలా మారటం ఏమిటి..?