బిగ్‌బాస్‌ హౌస్‌లో అర్చనకు ఏం జరిగింది?

0బిగ్‌బాస్ 22వ రోజు ఎపిసోడ్ చాలా నీరసంగా సాగింది. ఆసక్తికరమైన అంశాలేమీ కనిపించలేదు. సోమవారం ఎపిసోడ్ చాలా రొటీన్‌గా గడించింది. ఒకరికొకరు తాము చేసిన పనులు, ఇతరులు చేసిన పనులపై జాలి పడటం తప్ప ఏమీ కనిపించలేదు. నాలుగోవారానికి కల్పన, శివబాలాజీ, దీక్షా, మహేశ్ కత్తి, హరితేజ ఎలిమినేషన్‌కు నామినేట్ అయ్యారు. చివర్లో అర్చన పిచ్చిపట్టినట్టు అరవడం ఓ ట్విస్ట్. ఇంకా ఇంటిలో ఏమి జరిగాయో తెలుసుకోవాలంటే.

ఇంటిలో కొత్త కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టిన ఆదర్శ్‌కు బిగ్‌బాస్ కొత్త టాస్క్ అప్పగించారు. ఒక వ్యక్తి ఏమి మాట్లాడాలనుకొన్నా పాటల రూపంలోనే మాట్లాడాలి. మగవాళ్లు నైటీలు ధరించాలి. ఇద్దరు వ్యక్తుల చేతులకు బేడీలు వేసి కండ్లకు గంతలు కట్టాలి అనే ఆదేశాలను బిగ్ బాస్ జారీ చేశారు.

బిగ్ బాస్ ఆదేశాల మేరకు శివ బాలాజీ, ప్రిన్స్ మహిళలు ధరించే నైటీలు వేసుకొన్నారు. హరితేజకు మాటలను పాటల రూపంలో మాట్లాడాలని చెప్పారు. దీక్షా, అర్చన కళ్లకు గంతలు కట్టి చేతులకు బేడీలు వేశాడు ఆదర్శ్. బిగ్‌బాస్ ప్లే చేసిన పాటలకు ఇంటి సభ్యులు వయ్యారంగా నృత్యాలు చేశారు.

అలాగే ఆదర్శ్‌తో ఎవరైనా మాట్లాడాలంటే కంపల్సరీగా ముద్దు పెట్టుకోవాలనే నిబంధనను అమలు పరిచారు. దాంతో కల్పన చేతిపై, ప్రిన్స్ ఆదర్శ్ బుగ్గలపై ముద్దులు పెట్టారు. బిగ్‌బాస్ ట్యూన్‌కు సభ్యులందరూ చేసిన డ్యాన్స్ ఆకట్టుకొన్నది.

సమీర్ వదిలిన బిగ్‌బాంబ్ ప్రభావంతో మహేశ్ కత్తి నేలపైనే పడుకోవడం, కూర్చోవడం చేశాడు. కింద కూర్చొనే ముమైత్‌కు తెలుగు నేర్పించాడు. చిన్న చిన్న వ్యాఖ్యాలను దగ్గర కూర్చోపెట్టుకొని నేర్పాడు. ఇంటి సభ్యుల మధ్య ఉన్న సంబంధాల గురించి ముమైత్, మహేశ్ మాట్లడుకోవడం కనిపించింది. కల్పన, అర్చన మధ్య విభేదాలు, దీక్షా ముందే అన్ని ఎపిసోడ్స్‌ను చూసి వచ్చిందని మాట్లాడుకొన్నారు.

నాలుగో వారం ఇంటి నుంచి బయటకు పంపే నామినేషన్ ప్రక్రియను బిగ్‌బాస్ మొదలుపెట్టారు. ఇంటి నుంచి పంపాలనుకొన్న వారికి ఫోమ్‌ను ముఖంపై రాసి ఎలిమినేషన్‌కు నామినేట్ చేయాలి. శివబాలాజీ, కల్పన, మహేశ్ కత్తి, హరితేజ, దీక్షా ఎలిమినేషన్‌కు నామినేట్ అయ్యారు.

నామినేషన్ ప్రక్రియ తర్వాత ఇంటి సభ్యుల మధ్య సర్దుబాటు వ్యవహారం మొదలైంది. నేను అలా అనుకోనేలేదని, ఇలా అనుకోలేదని ఒకరికొకరు చెప్పుకొన్నారు. దీక్షాకు ప్రిన్స్ అలవాటు పడలేదని ధన్‌రాజ్ అనడం గమనార్హం. మాటలను పాటల రూపంలో పాడుతూ హరితేజ చలాకీగా కనిపించింది.

అర్ధరాత్రి ఒంటరిగా ధన్‌రాజ్, దీక్షా పంత్‌లు కూర్చొన్నారు. ఈ సందర్భంగా దీక్షా పంత్‌ను ఇంటర్వ్యూ చేశాడు. బిగ్‌బాస్ అంటే ఏమిటీ? బిగ్‌బాస్ ఎందుకు వచ్చావు? బిగ్‌బాస్ విన్నర్‌గా కావాలని వచ్చావా? లేక బిగ్‌బాస్ ఫైనలిస్ట్ కావాలని వచ్చావా అనే ప్రశ్నలును ధన్ రాజ్ అడిగాడు. అందుకు నేను ఫైనలిస్టుగా కావాలనుకొంటున్నట్టు దీక్షా చెప్పింది.

ఓవరాల్‌గా సోమవారం ఎపిసోడ్ ఎలాంటి మెరుపులు లేకుండా ముగిసింది. ఒక నామినేషన్ ప్రక్రియ తప్ప ఈ ఎపిసోడ్‌లో చెప్పుకోవాల్సిన అంశాలు ఏమీ లేవు. ఇంటి సభ్యులు ఒకరిమీద ఒకరు చాడీలు చెప్పుకోవడం, మిగితా అంతా సొల్లుగానే సాగింది. చివర్లో అర్చన పిచ్చి పట్టినట్టు అరుస్తూ ఉండే సీన్ చూపించి రేపటి కార్యక్రమంపై ఆసక్తిని రేపాడు.