దేవదాస్ కోసం గోల్డ్ కోచ్

0



నాగార్జున నానిలు మొదటి సారి కలిసి నటిస్తున్న దేవదాస్ ఈ నెల 27న విడుదల కాబోతోంది. చాలా రోజుల తర్వాత టాలీవుడ్ లో వస్తున్న మల్టీ స్టారర్ గా ఇరు హీరోల అభిమానులతో పాటు సినిమా లవర్స్ కూడా దీని మీద భారీ అంచనాలు పెట్టుకున్నారు. దానికి తగ్గట్టు మణిశర్మ స్వరపరిచిన రెండు పాటలు ఆన్ లైన్ లో మంచి రెస్పాన్స్ తెచ్చుకోవడంతో యూనిట్ మాంచి హుషారుగా ఉంది. ఇకపోతే ఇందులో మరొక ప్రత్యేకమైన విశేషం కూడా ఉంది. అదే విలన్ గా కునాల్ కపూర్ ఎంట్రీ. ఇప్పటిదాకా బాలీవుడ్ ప్రేక్షకులకు మాత్రమే సుపరిచితుడు అయిన కునాల్ మొదటి సారి తెలుగు సినిమాలో కనిపించబోతున్నాడు. అది కూడా విలన్ గా. ఇటీవలే విడుదలైన హిందీ సినిమా గోల్డ్ లో అక్షయ్ కుమార్ తీసుకొచ్చిన హాకీ టీమ్ కు ట్రైనింగ్ ఇచ్చే కోచ్ గా తనతో పోటీ పడుతూ సమానంగా నటించిన పాత్రలో కునాల్ విమర్శకుల ప్రశంశలు కూడా అందుకున్నాడు.

ఈ మధ్య కాలంలో విలన్ల కొరత టాలీవుడ్ ను బాగా ఇబ్బంది పెడుతోంది. పదే పదే ఒకరినే చూస్తుంటే ప్రేక్షకులు బోర్ గా ఫీలవుతున్నారు. అందుకే ఈ బాలీవుడ్ దిగుమతి తప్పడం లేదు. కునాల్ కపూర్ మంచి టాలెంటెడ్ ఆర్టిస్ట్. హీరోగా కూడా మంచి పేరే ఉంది ఇతగాడికి. 2005లో పరిశ్రమకు వచ్చిన కునాల్ చేసింది తక్కువ సినిమాలే అయినప్పటికీ ఇతనికంటూ ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. బక్కపలచని దేహంతో ఉన్నా శరీర సౌష్టవాన్ని బాగా మైంటైన్ చేసే కునాల్ దేవదాస్ ఆకర్షణలో ఒకడిగా నిలవబోతున్నాడు అని టాక్. మరి నాగార్జున నానిలకు ఒకేసారి సవాల్ విసిరే విలన్ అంటే ఆ మాత్రం బిల్డప్ ఉండాల్సిందే. ఇతని లుక్స్ ఇంకా అధికారికంగా విడుదల చేయలేదు. ట్రైలర్ లో చూసుకోవచ్చు. అమీర్ కపూర్ లాంటి నటుడితో రంగ్ దే బసంతి లాంటి క్లాసిక్స్ లో నటించిన కునాల్ దేవదాస్ కు ఎంత పెద్ద ప్లస్ అయ్యాడో ఈ నెల 27న చూసుకోవచ్చు.