కేసీఆర్‌గా నటించబోతున్నది ఇతనే!

0Bollywood-actor-to-play-kcrతెలంగాణ ఉద్య‌మ‌నాయ‌కుడు, ముఖ్య‌మంత్రి కే చంద్రశేఖర్‌రావు జీవిత చరిత్ర ఆధారంగా ఓ సినిమా తెరకెక్కబోతున్న సంగతి తెలిసిందే. అయితే, ప్రతిష్టాత్మకంగా తెరకెక్కబోతున్న ఈ సినిమాలో కేసీఆర్ పాత్ర‌లో ఎవ‌రు న‌టిస్తారనే సస్పెన్స్‌కు తెరపడింది. మధుర శ్రీధర్‌ దర్శకత్వంలో ’పెళ్లిచూపులు’ నిర్మాత రాజ్‌ కందుకూరి నిర్మిస్తున్న ఈ సినిమాలో కేసీఆర్‌గా బాలీవుడ్ న‌టుడు రాజ్‌కుమార్ రావు నటించనున్నాడు. ఈ విషయాన్ని తాజాగా నిర్మాత రాజ్ కందుకూరి తెలిపారు. కాయ్ పో చే, క్వీన్‌, అలీగఢ్‌‌ లాంటి చిత్రాల‌తో మంచి న‌టుడిగా రాజ్‌కుమార్ రావు పేరు తెచ్చుకున్నాడు. శృతి హాసన్‌ జంటగా అతడు నటించిన తాజా సినిమా ’బెహెన్‌ హోగీ తేరి’ సినిమా త్వరలోనే రానుంది.

బాల్యం నుంచి రాజ‌కీయ‌ నాయ‌కుడిగా ఎదిగిన తీరు, ఉద్యమ నాయకుడిగా తెలంగాణ ఉద్యమంలో ఆయన పోషించిన పాత్ర, ముఖ్య‌మంత్రిగా రాష్ట్రాన్ని నడుపుతున్న విధానం.. అన్నింటినీ ఈ చిత్రంలో చూపించనున్నట్టు నిర్మాత తెలిపారు. బ‌డ్జెట్ ఎంతైనా స‌రే రాజీ ప‌డ‌కుండా నిర్మిస్తామని ఆయన ఓ మీడియా సంస్థతో చెప్పారు.

ఇప్ప‌టికే ఈ సినిమా ప్రీప్రొడ‌క్ష‌న్ వ‌ర్క్ పూర్త‌యింద‌ని, త్వ‌ర‌లోనే షూటింగ్ ప్రారంభిస్తామ‌ని దర్శకుడు శ్రీధ‌ర్ వెల్ల‌డించారు. వ‌చ్చే ఏడాది జూన్ 2న తెలంగాణ ఆవిర్భావ దినోత్స‌వం నాడు ఈ సినిమాను విడుద‌ల‌కు ప్లాన్ చేస్తున్నామ‌ని చెప్పారు.