ఒక్క ఓవర్‌కు రూ.60 లక్షలు

0ఒక్క తప్పుడు ఓవర్‌కు రూ.60 లక్షలు. ఇదీ బౌలర్లతో క్రికెట్‌ బుకీలు కుదుర్చుకున్న ఒప్పందం. దీని ప్రకారం బౌలర్లు బ్యాట్స్‌మెన్‌కు భారీషాట్లు కొట్టటానికి వీలైన బంతులు వేసి ధారాళంగా పరుగులు ఇవ్వాలి. అంతకన్నా ముందే బుకీలకు సంకేతాలు అందించాలి. రాజస్థాన్‌ రాయల్స్‌ జట్టుకు చెందిన శ్రీశాంత్‌, అంకిత్‌ చవాన్‌, అజిత్‌ చండీలా అరెస్టు తర్వాత ఢిల్లీ పోలీస్‌ కమిషనర్‌ నీరజ్‌కుమార్‌ వెల్లడించిన అంశాలివి. ఆటగాళ్ల అరెస్టు నేపథ్యంలో ఆయన గురువారం విలేకర్లతో మాట్లాడుతూ.. ఫిక్సింగ్‌ వ్యవహారంలో జరిగిన సంభాషణలను, తమ దర్యాప్తు తీరును వివరంగా తెలియజేశారు.

క్రీడాకారులకు బుకీలకు మధ్య జరిగిన ఫోన్‌ సంభాషణలకు సంబంధించి కొన్ని వందల గంటల ఆడియో రికార్డులు తమ వద్ద ఉన్నాయని చెప్పారు. ”కొన్ని ఓవర్లలో ముందే నిర్ణయించినన్ని పరుగులు వచ్చేలా బంతులు వేయాలి. అంతేకాదు, సదరు ప్రత్యేక ఓవర్‌ వేయటానికి ముందే బుకీలకు బౌలర్లు సంకేతాలివ్వాలి. ప్యాంటు జేబులో టవల్‌ పెట్టుకోవటం, ఆటగాళ్లను ఫీల్డింగ్‌లో మోహరించటానికి సమయం తీసుకోవటం, చొక్కా విప్పటం వంటి సంజ్ఞలివ్వాలి” అని తెలిపారు.

మే 5, 9, 15 తేదీల్లో వరుసగా పుణె వారియర్స్‌, కింగ్‌ ఎలెవన్‌ పంజాబ్‌, ముంబయి ఇండియన్స్‌తో రాజస్థాన్‌ రాయల్స్‌ తలపడింది. ఈ మూడుమ్యాచుల్లో ఫిక్సింగ్‌ జరిగినట్టు తమ దర్యాప్తులో తేలిందని నీరజ్‌కుమార్‌ చెప్పారు. పుణె వారియర్స్‌తో జరిగిన మ్యాచులో చండీలా తన రెండో ఓవర్లో 14 పరుగులు ఇచ్చారని.. ఇది ఒప్పందం మేరకే జరిగిందన్నారు. అయితే, ఓవర్‌ వేయటానికి ముందు బుకీలకు సంకేతం ఇవ్వటం ఆయన మర్చిపోయాడని, దీంతో ఆ ఓవర్‌పై బుకీలు బెట్టింగులు పెట్టలేదని.. తాము అడ్వాన్సుగా ఇచ్చిన రూ.20 లక్షలను తిరిగి ఇవ్వాలని చండీలాను డిమాండ్‌ చేశారని చెప్పారు. దీనిపై చండీలాకు, బుకీలకు మధ్య పెద్దఎత్తున వాగ్వాదం చోటుచేసుకుందన్నారు. ఈ మ్యాచ్‌కు ముందు అమిత్‌కుమార్‌ అనే బుకీతో చండీలా ఫోన్‌లో సంభాషించాడని తెలిపారు. ఒప్పందం మేరకు ‘ప్రత్యేక ఓవర్‌’ వేయటానికి ముందు చండీలా చొక్కాను కొద్దిగా పైకి లేపాలని, కానీ, ఆయన ఆ విషయం మర్చిపోయినప్పటికీ 14 పరుగులు ఇచ్చాడన్నారు. మే 9న మొహాలీలో జరిగిన మ్యాచ్‌లో శ్రీశాంత్‌.. బుకీలకు అనుకూలంగా వేసిన ఓవర్‌ వివరాలను డీసీపీ సంజీవ్‌యాదవ్‌ వెల్లడించారు. ”ఈ మ్యాచులో శ్రీశాంత్‌ తన రెండో ఓవర్‌లో 14 పరుగులు ఇవ్వాల్సి ఉంది. ఓవర్‌ వేయటానికి ముందు బుకీలకు సంకేతాలిస్తూ.. శ్రీశాంత్‌ తన ప్యాంటు జేబులో బయటికి కనిపించేలా జేబురుమాలును పెట్టుకున్నాడు. బుకీలకు మరింత సమయం ఇవ్వటానికి వీలుగా కొద్దిసేపు ఎక్సర్‌సైజులు కూడా చేశాడు. ఒప్పందానికన్నా ఒక పరుగు తక్కువగా ఈ ఓవర్‌లో 13 పరుగులే ఇచ్చాడు” అని తెలిపారు. ఈ మేరకు ఆ మ్యాచ్‌లో శ్రీశాంత్‌ వేసిన రెండోఓవర్‌ వీడియోను విలేకర్ల ఎదుట పోలీసులు ప్రదర్శించారు. బుకీలతో శ్రీశాంత్‌ సన్నిహిత మిత్రుడు జిజూజనార్దన్‌ సంప్రదింపులు జరిపాడని, శ్రీశాంత్‌కు బుకీల నుంచి రూ.40 లక్షలు ముట్టాయని పేర్కొన్నారు. మే 15న ముంబయి ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో అంకిత్‌ చవాన్‌ ‘ప్రత్యేక ఓవర్‌’ వేసి 14 పరుగులు ఇచ్చాడని, ఈ వ్యవహారంలో బుకీలకు, చవాన్‌కు మధ్యవర్తిగా అజిత్‌ చండీలా వ్యవహరించాడన్నారు. ఈ మ్యాచులో చండీలా ఆడలేదని గుర్తు చేశారు.

‘ప్రత్యేక ఓవర్‌’ వేయటానికి ముందు చవాన్‌.. తన చేతికున్న కంకణాన్ని కదిలించటం ద్వారా బుకీలకు సంకేతాలను అందించాడని వెల్లడించారు. ఈ మూడుమ్యాచులకూ పోలీసు బృందం హాజరైందని.. అన్ని ఆధారాలను సేకరించిన తర్వాతే శ్రీశాంత్‌, చండీలా, అంకిత్‌లను, కొద్దిమంది బుకీలను అరెస్టు చేశామని తెలిపారు. ముంబయి మాఫియా ఈ ఫిక్సింగ్‌ వ్యవహారాలు చేస్తోందన్న సమాచారం మేరకు తాము దీనిపై నిఘా పెట్టినప్పుడు ఈ ముగ్గురు ఆటగాళ్ల పేర్లు బయటికొచ్చాయని, దీంతో వారిని ఒకేసారి పట్టుకోవటానికి అనువైన సమయం కోసం వేచి చూస్తూ వచ్చామన్నారు.