బ్రహ్మి ఏ స్థాయికి పడిపోయాడంటే..

0బ్రహ్మానందం.. తెలుగు సినీ చరిత్రలోనే కమెడియన్లలో ఎవ్వరికీ సాధ్యం కాని స్టార్ స్టేటస్ సంపాదించిన నటుడు. ఆయన కామెడీ పండితే.. దాని మీదే సినిమాలు బ్లాక్ బస్టర్లయిపోయిన రోజులున్నాయి. స్టార్ హీరోలు.. పేరు మోసిన దర్శక నిర్మాతలు ఆయన లేకుండా సినిమాలు చేసేవాళ్లు కాదు ఒకప్పుడు. ఆయన డేట్ల కోసం విపరీతమైన డిమాండుండేది. ఒక్క కాల్ షీట్ కోసం కొన్ని లక్షలు చెల్లించిన రోజులున్నాయి. అలాంటి కమెడియన్ కు రెండు మూడేళ్లుగా రోజులు బాగా లేవు. ఆయన చేసిన సినిమాలు వరుసగా ఫ్లాప్ కావడంతో ఒక నెగెటివ్ ముద్ర వేసి పక్కన పెట్టేస్తూ వచ్చారు దర్శకులు. ఆయనకు నెమ్మదిగా సినిమాలు తగ్గిపోతూ వచ్చి ఇండస్ట్రీ నుంచి అంతర్ధానమైపోయే పరిస్థితి వచ్చేసింది. ఒకప్పుడు బ్రహ్మి ఒక పెద్ద సినిమాలో లేకపోతే ఆశ్చర్యపోవాళ్లం. కానీ బ్రహ్మి ఇప్పుడేదైనా సినిమాలో కనిపిస్తే ఆశ్చర్యపోతున్నాం.

బ్రహ్మి అప్పుడప్పుడూ ఒకటీ అరా సినిమాల్లో కనిపిస్తున్నా.. ఏ పాత్రా రిజిస్టర్ కావడం లేదు. ఆయన పాత్రల్లో ఏ ప్రత్యేకతా కనిపించడం లేదు. కొన్ని క్యారెక్టర్లయితే మరీ దారుణంగా ఉంటున్నాయి. తాజాగా ‘నేల టిక్కెట్టు’ సినిమాలో బ్రహ్మి పాత్ర చూసిన ఎవరికైనా అయ్యో అనిపించకమానదు. కెరీర్ ఆరంభంలో కూడా బ్రహ్మి ఇంత పేలవమైన పాత్ర చేసి ఉండడు. ఆయనది ఒక బిచ్చగాడి పాత్ర. సినిమా మొత్తంలో ఉన్నవి రెండు మూడు సీన్లు. అందులోనూ ఒక్క డైలాగ్ లేదు. దర్శకుడు కళ్యాణ్ కృష్ణ ఏం ఆశించి బ్రహ్మికి ఈ పాత్ర ఇచ్చాడో.. ఆయనెలా ఒప్పుకున్నాడో తెలియదు. అసలు ఈ పాత్ర సినిమాలో ఎందుకన్నదే అర్థం కాదు. ఇలాంటి పాత్ర ఒప్పుకున్నాడంటేనే బ్రహ్మి దయనీయ పరిస్థితి అర్థం చేసుకోవచ్చంటున్నారు జనాలు. ఐతే బ్రహ్మి అభిమానులు మాత్రం ఆయన పూర్తిగా సినిమాలు మానేసినా పర్వాలేదు కానీ.. ఇలాంటి పాత్రలు మాత్రం చేయొద్దని కోరుకుంటున్నారు.