స్టార్ మాలో బ్రహ్మీ.. అసలు స్టోరీ ఇది!

0మూడు నాలుగు సంవత్సరాల క్రితం బ్రహ్మానందం లేని స్టార్ హీరో సినిమా ఉండేది కాదు. స్టార్ హీరోలు అడిగి మరీ బ్రహ్మానందం తమ సినిమాలో ఉండేలా చూసుకునేవారు అంటే అప్పట్లో బ్రహ్మీ క్రేజ్ ఏ రేంజ్ లో ఉండో అర్థం చేసుకోవచ్చు. స్టార్ హీరోల ఎన్నో చిత్రాలు బ్లాక్ బస్టర్ అవ్వడంలో బ్రహ్మానందం కీలక పాత్ర పోషించాడు. మహేష్ బాబు కెరీర్ లో నిలిచి పోయే సూపర్ హిట్స్ ను అందుకున్న ‘అతడు’ – ‘దూకుడు’ – ‘పోకిరి’ చిత్రాల్లో బ్రహ్మానందం పాత్రలు చాలా కీలకం. బ్రహ్మీ కామెడీ ఆ సినిమాల సక్సెస్ లో సగం పాత్ర పోషించాయి. కేవలం మహేష్ బాబు సినిమాల్లో మాత్రమే కాకుండా ఎంతో మంది స్టార్ హీరోల సినిమాల్లో నటించి నవ్వులు పూయించి సక్సెస్ లను అందుకున్న బ్రహ్మానందం గత కొంత కాలంగా ఫాం కోల్పోయాడు.

బ్రహ్మానందం చేసిన ఏ పాత్ర కూడా ప్రేక్షకులను అలరించలేక పోతుంది. హాస్యబ్రహ్మను ప్రేక్షకులు కొత్తగా చూడాలనుకుంటున్నారు. కాని బ్రహ్మానందంను మాత్రం దర్శకులు ఎప్పుడు ఒకే విధంగా చూపించే ప్రయత్నం చేస్తున్నారు. ఆ కారణంగా బ్రహ్మానందం మెల్ల మెల్లగా ఫేడ్ ఔట్ అవుతూ వస్తున్నాడు. బ్రహ్మానందం గత కొంత కాలంగా అడపా దడపా మాత్రమే సినిమాల్లో కనిపిస్తున్నాడు. తన స్థాయి తగ్గించుకుని చిన్న చిత్రాల్లో కూడా నటించినా కూడా సక్సెస్ అనేది దక్కడం లేదు. ఒకప్పుడు రోజుకు మూడు నాలుగు లక్షల పారితోషికంను అందుకున్న బ్రహ్మానందం ఇప్పుడు లక్షల రూపాయల పారితోషికంకు కూడా కొన్ని సినిమాలు చేసిన సందర్బాలున్నాయి. వెండి తెరపై వెలుగు వెలిగిన బ్రహ్మానందం ఇప్పుడు బుల్లి తెరపై నవ్వులు పూయించేందుకు సిద్దం అవుతున్నాడు. త్వరలోనే స్టార్ మాటీవీలో బ్రహ్మానందం కామెడీ షో ఒకటి ప్రసారం కాబోతుంది.

మాటీవీని స్టార్ ఎంటర్ టైన్ మెంట్ సంస్థ వారు తీసుకున్న తర్వాత ఎన్నో కొత్త షోలను తీసుకు వస్తున్నారు. అందులో భాగంగానే ఒక కామెడీ షోను చేసేందుకు సిద్దం అయ్యారు. తెలుగులో కామెడీకి కింగ్గా పేరున్న బ్రహ్మానందంతో ఆ షో చేస్తే తప్పకుండా మంచి ఫలితం ఉంటుందని స్టార్ మా వారు భావిస్తున్నారు. అందుకే బ్రహ్మానందంతో కామెడీ షోను ప్లాన్ చేస్తున్నారు. ఈటీవీలో దాదాపు ఆరు సంవత్సరాలుగా ప్రసారం అవుతూ సూపర్ హిట్ షోగా దూసుకు పోతున్న జబర్దస్త్ కామెడీ షోకు బ్రహ్మానందం కామెడీ షోతో చెక్ పెట్టాలని స్టార్ మాటీవీ ప్రయత్నాలు చేస్తుంది. తాజాగా బ్రహ్మానందం కామెడీ షోకు సంబంధించిన ట్రైలర్ ను వదిలిని స్టార్ మా – త్వరలోనే పూర్తి వివరాలను ప్రకటించనుంది. ప్రస్తుతం ప్రసారం అవుతున్న బిగ్బాస్ సీజన్ 2 పూర్తి అయిన వెంటనే ఆ సమయంలో బ్రహ్మానందం కామెడీ షోను ప్రసారం చేసే అవకాశం ఉంది. ఈ కామెడీ షో ఎలా ఉండబోతుంది అనే విషయంలో ప్రస్తుతం బుల్లి తెర ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. వెండి తెరపై వెలుగు వెలిగిన హాస్యబ్రహ్మ బుల్లి తెర ప్రేక్షకులను అలరించగలడా అనేది ప్రస్తుతం చర్చనీయాంశం.