‘బ్రాండ్ బాబు’తో దానికి బ్యాండ్

0మారుతి స్క్రిప్టుతో.. మారుతి సమర్పణలో సినిమా అంటేనే జనాలు బెంబేలెత్తిపోయే పరిస్థితి వచ్చేసింది. రెండేళ్ల కిందట వచ్చిన ‘రోజులు మారాయి’తోనే మారుతి బ్రాండ్ బాగా దెబ్బ తింది. ఇప్పుడు రచయితగా.. నిర్మాతగా మారుతికి ఉన్న అంతంతమాత్రం పేరును కూడా ‘బ్రాండ్ బాబు’ దెబ్బ తీసింది. మారుతి తాను తీయకుండా వేరెవరికైనా స్క్రిప్టు ఇచ్చాడంటే అందులో క్వాలిటీ ఉండదనే అభిప్రాయం బలపడిపోయేలా చేసింది ‘బ్రాండ్ బాబు’. బ్రాండ్ల పిచ్చి ఉన్న కోటీశ్వరుడు.. ఒక పని మనిషిని ప్రేమిస్తే ఎలా ఉంటుందనే పాయింట్ ఆసక్తికరమే అయినా.. దాన్ని పూర్తి స్క్రిప్టుగా మలచడంలో మారుతి దారుణంగా విఫలమయ్యాడు. ఇక దర్శకుడు ప్రభాకర్ ఈ చిత్రాన్ని మలిచిన తీరు గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. మొత్తానికి ‘బ్రాండ్ బాబు’ బాక్సాఫీస్ దగ్గర దారుణ ఫలితాన్నందుకుంది.

ఐతే కథ ఇక్కడితో ముగిసిపోతే బాగుండు. కానీ మారుతి బ్రాండుతో ఇంకో సినిమా కూడా విడుదల కోసం ఎదురు చూస్తోంది. అదే.. భలే మంచి చౌక బేరం. దీనికి కాన్సెప్ట్ ఇచ్చింది మారుతినే. అతను సమర్పకుడు కూడా. ఇంతకుముందు మారుతి స్క్రిప్టుతో ‘రోజులు మారాయి’ అనే ఫ్లాప్ మూవీ తీసిన మురళీ కృష్ణ దర్శకుడు. నిజానికి ఇది ‘బ్రాండ్ బాబు’ కంటే ముందు రావాల్సిన సినిమా. కానీ దీనికి ఆశించిన స్థాయిలో బజ్ రాలేదు. బిజినెస్ జరగలేదు. ఈలోపు ‘బ్రాండ్ బాబు’ తెరమీదికి వచ్చింది. దానికి కాస్త క్రేజ్ వచ్చింది. ఈ సినిమా మంచి ఫలితాన్నందుకుంటే.. అది ‘భలే మంచి చౌక బేరం’ సినిమాకు కలిసొస్తుందని అనుకున్నారు. కానీ ‘బ్రాండ్ బాబు’కు బ్యాండ్ తప్పలేదు. దీంతో మారుతి తర్వాతి సినిమా మరింత కష్టాల్లో పడింది. ఈ స్థితిలో ఆ చిత్రానికి ఇక మోక్షం కలగడం కష్టమే అంటున్నారు.