తేజస్వి కోసం బిగ్ బాస్ భారీ ప్లాన్.?

0గతేడాది నిర్వహించిన బిగ్ బాస్ కి.. ఈ ఏడాది నిర్వహించిన బిగ్ బాస్ కి మధ్య కొంత సామీప్యత ఉంది. గడిచిన సీజన్ లో హరితేజ ఎంతో యాక్టివ్ గా ఇంట్లో ఉంటూ అల్లరి పనులు చేస్తూ నవ్విస్తూ ఎంటర్ టైన్ చేసింది. ఈ సీజన్ లో హరితేజ పాత్రలో తేజస్వి మడివాడ అంతకుమించిన ఎంటర్ టైన్ మెంట్ పంచింది. అయితే సామ్రాట్ తో లవ్ ఎఫైరే ఆమె కొంపముంచిందనే విమర్శలున్నాయి. డోసుకు మించి ప్రవర్తించడంతో ఈ వారం తేజస్వి ఎలిమినేట్ అయిపోయిందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

అయితే తేజస్వి లాంటి యాక్టివ్ పర్సన్ బిగ్ బాస్ లో లేకపోవడం అందరికీ షాకింగ్ లాంటి వార్తే.. ముఖ్యంగా బిగ్ బాస్ టీంను ఇది కలవరపెడుతోంది. బిగ్ బాస్ కు రేటింగ్ రావడానికి తేజస్వి రోమాంటిక్ యాంగిల్ కూడా ఓ కారణమే.. బిగ్ బాస్ షోకే తేజస్వి తన జోష్ తో కళ తెప్పించిందని నాని కూడా నిన్న రాత్రి అన్నాడంటే ఆమె ఎంటర్ టైన్ మెంట్ ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు.. తేజస్వి విషయంలో నానికి సాఫ్ట్ కార్నర్ ఉంది. ఆదివారం రాత్రి తేజస్వి ఎలిమినేట్ అవుతుండగా చివర్లో తేజస్వి ఏవీ వీడియో చూసి నాని ఎమోషన్ అయ్యారు. ఆమెను గట్టిగా హత్తుకొని ఓదార్చాడు. ఇలా నాని స్వయంగా హత్తుకోవడం ఇంతవరకూ ఎలిమినేట్ అయిన ఐదుగురి విషయంలో చోటుచేసుకోలేదు..

తాజాగా బిగ్ బాస్ టీం ప్రోమో రిలీజ్ అయ్యింది. ఇందులో గడిచిన ఆరువారాల్లో ఎలిమినేట్ అయిన ఆరుగురు కంటెస్టెంట్ల నుంచి ప్రేక్షకుల ఓటింగ్ ప్రకారం అత్యధిక ఓట్లు సంపాదించిన ఒకరిని బిగ్ బాస్ లోకి మళ్లీ పంపించబోతున్నామని నాని ప్రకటించాడు. ఇందులో సంజన – నూతన్ నాయుడు – కిరిటీ దామరాజు – శ్యామల – భానుశ్రీ – తేజస్విలలో ఎవరో ఒకరు ఈ వారం మళ్లీ బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లనున్నారు.

కాగా ఈ ఆరుగురిలోకి అత్యధిక ఫాలోయింగ్ ఉన్నది తేజస్వికే.. సంజన నూతన్ సామాన్యులు కాగా.. కౌశల్ కళ్లల్లో నిమ్మరసం పోసిన కిరిటీపై తీవ్ర వ్యతిరేకత ఉంది. ఇక పిన్నిగారంటూ హౌస్ లో సైలెంట్ గా ఉన్న శ్యామల మోస్తారు కంటెస్టెంటే.. ఇక భానుశ్రీ – తేజస్వి మాత్రమే ఫైర్ బ్రాండ్స్.. ఈ ఇద్దరిలోకి కొద్దిగా తేజస్వినే యాక్టివ్ మెరుగైన కంటెస్టెంట్ గా బిగ్ బాస్ చూసిన వారు వ్యాఖ్యానిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఎలిమినేట్ అయిపోవారికి ఓటింగ్ పెడితే ఖచ్చితంగా తేజస్వికే ఎక్కువ ఓట్లు పడతాయని విశ్లేషిస్తున్నారు.. ఆమెనే మళ్లీ హౌస్ లోకి వెళ్లడం ఖాయమంటున్నారు.. తేజస్విని ఎలాగైనా బిగ్ బాస్ హౌస్ లోకి పంపించేందుకే బిగ్ బాస్ టీం ఈ ప్లాన్ చేసినట్టు అర్థమవుతోందంటున్నారు.