మరో వివాదంలో కంగనా రనౌత్

0కంగనా రనౌత్ అంటే ఎప్పుడూ ఏదో ఒక వివాదం ఉండాల్సిందే. తాజాగా ఆమె ఒక కాంట్రవర్శీలో చిక్కుకుంది. ముంబయిలో గత ఏడాది పాలి హిల్ ఏరియాలో ఒక ఖరీదైన బంగ్లాను కొనుగోలు చేసింది. ఐతే కంగనాకు ఈ బంగ్లాను చూపించిన బ్రోకర్.. తనకు ముందు అన్న ప్రకారం బ్రోకరేజీ ఇవ్వలేదంటూ పోలీస్ కేసు పెట్టాడు. కంగనా సోదరి రంగోలి చందేల్.. కంగనా స్టాఫ్ మెంబర్ల మీదా అతను ఫిర్యాదు చేశాడు. ఐతే దీనిపై కంగనా మీడియాకు వివరణ ఇచ్చింది.

ఈ డీల్ కు సంబంధించి తాను ఒక పర్సంట్ బ్రోకరేజీ ఇస్తానని చెప్పానని.. అన్న ప్రకారమే రూ.22 లక్షలు అతడికి ఇచ్చానని.. చాలా నెలల కిందటే అతడికి డబ్బులు ముట్టాయని.. తనతో ఈ బంగ్లా గురించి చెప్పేటపుడే ఒక శాతం బ్రోకరేజీ కావాలని అతను కండిషన్ పెట్టాడని కంగనా పేర్కొంది. ఇప్పుడు మాత్రం 2 పర్సంట్ బ్రోకరేజీ అంటున్నాడని.. ఇంకో రూ.22 లక్షలు డిమాండ్ చేస్తున్నాడని.. డబ్బుల కోసం తనను వేధించే ప్రయత్నం చేస్తున్నాడని కంగన చెప్పింది.

తాను ఎన్నడూ 2 పర్సంట్ బ్రోకరేజీపై హామీ ఇవ్వలేదని.. అతడికి డబ్బులు ఇచ్చే ప్రసక్తే లేదని.. తమ మధ్య జరిగిన ఒప్పందానికి సంబంధించి తన దగ్గర ఆధారాలు ఉన్నాయని.. ఇంతకుమించి చెప్పేదేమీ లేదని.. పోలీసులకు కూడా ఇదే విషయం స్పష్టం చేశామని కంగన తెలిపింది. ఒక శాతం బ్రోకరేజీ కింద రూ.22 లక్షలు ఇచ్చిందంటే.. ఈ బంగ్లా విలువ రూ.22 కోట్లకు పైనే అన్నమాట. దీనికి స్టాంప్ డ్యూటీ కింద ఆమె కోటి రూపాయల పైనే చెల్లించిందట. ఈ బంగ్లా విస్తీర్ణం 3 వేల చదరపు అడుగుల పైనే ఉన్నట్లు సమాచారం.