మార్చికల్లా తెలంగాణ రాష్ట్రంలో బీఎస్‌ఎన్‌ఎల్ 4జీ సేవలు

0bsnl-4g-roll-out-in-telangaప్రభుత్వరంగ టెలికం సంస్థ బీఎస్‌ఎన్‌ఎల్..వచ్చే ఏడాది మార్చి నాటికి రాష్ట్రంలో 4జీ సేవలను ఆరంభించనున్నట్లు ప్రకటించింది. 2018 మార్చి నాటికి తెలంగాణతోపాటు ఆంధ్రప్రదేశ్‌ల్లో 4జీ సేవలు అందించడానికి 1,150 సైట్లను ఏర్పాటు చేస్తున్నట్ల్లు బీఎస్‌ఎన్‌ఎల్ తెలంగాణ సర్కిల్ చీఫ్ జనరల్ మేనేజర్(సీజీఎం) ఎల్ అనంతరాం తెలిపారు. 4జీ ప్రాజెక్టులో భాగంగా టెండరింగ్ ప్రక్రియ ముగిసిందని, ప్రధాన కార్యాలయం సూచన మేరకు చర్యలను వేగవంతం చేసినట్లు ఆయన విలేకరులతో చెప్పారు. దేశవ్యాప్తంగా 4జీ సేవలు అందించడానికి 10 వేల 4జీ సైట్లను ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించిన సంస్థ..

తెలంగాణలో 550, ఏపీలో 600 సైట్లను ఏర్పాటు చేయనున్నది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో దక్షిణాదిలో ఏపీ సర్కిల్(ఏపీ, తెలంగాణ) అత్యధికంగా 4.27 లక్షల మంది సబ్‌స్ర్కైబర్లు కంపెనీ సేవల పరిధిలోకి వచ్చారన్నారు. 2016-17లో ఏపీ సర్కిల్ ద్వారా సంస్థకు రూ.2,500 కోట్ల ఆదాయం సమకూరింది. మొదటి విడుతలో భాగంగా రాష్ట్రంలో 63 ప్రాంతాల్లో వై-ఫై సేవలను అందిస్తుండగా, వచ్చే నెల చివరి నాటికి ఈ సంఖ్యను 120కి పెంచనున్నట్లు ఆయన ప్రకటించారు.

విద్యార్థుల కోసం ప్రతిభ ప్లాన్: పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థుల కోసం బీఎస్‌ఎన్‌ఎల్ ప్రత్యేక ప్లాన్‌ను ఆవిష్కరించింది. ప్రతిభ పేరుతో ప్రకటించిన ఈ ఆఫర్ పరిధిలోకి రావాలంటే రూ.49తో రీచార్జ్ చేసుకోవాల్సి ఉంటుంది.

ఈ ప్లాన్‌లో భాగంగా నెలకు 3జీబీ డాటా, తల్లిదండ్రులతో(ఒక ల్యాండ్‌లైన్, ఒక మొబైల్ నంబర్) అన్‌లిమిటెడ్‌గా మాట్లాడుకోవచ్చును, ఇతర నెట్‌వర్క్ కాల్‌పై సెకండ్‌కు ఒక పైసా, అదనంగా రూ.20 టాక్‌టైం లభించనున్నది. ఈ సందర్భంగా ఐఐటీ, ఎంసెట్‌లో ర్యాంక్ సాధించిన విద్యార్థులకు అనంతరాం సిమ్‌లను అందచేశారు. సుప్రీంకోర్టు మార్గదర్శకాలను అనుసరించి ఫిబ్రవరి 6, 2018 లోగా వినియోగదారులు రీ- వెరిఫికేషన్ చేసుకోవాలని కోరారు. కేవైసీ విధానం ద్వారా ఈ వెరిఫికేషన్ చేసుకోవాలని, దీని ద్వారా ఆధార్ కార్డు, వేలి ముద్రలను మొబైల్ నంబర్‌కు లింక్ చేయనున్నట్లు వివరించారు.