బన్నీ నుంచి రెండు భారీ అనౌన్స్మెంట్స్

0అల్లు అర్జున్ చివరి సినిమా ‘నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా’ విడుదలై వంద రోజులు దాటింది. కానీ ఇప్పటిదాకా అతడి కొత్త సినిమా మొదలు కాలేదు. అసలు అతను చేయబోయే కొత్త సినిమా ఏదీ ఇంకా కన్ఫమ్ అయినట్లు కూడా లేదు. అసలే ప్రకటనా రాలేదు. ఈ మధ్య మీడియాను కలిసినపుడు అల్లు అరవింద్.. బన్నీ కొత్త సినిమా అక్టోబర్లో మొదలవుతుందని అన్నాడు కానీ.. ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే అదేమీ ఖాయంగా అనిపించడం లేదు. ఇంతకుముందు అనుకున్ను విక్రమ్ కుమార్ సినిమాను ఫైనల్ చేయకుండా.. వేరే ఆప్షన్లు కూడా బన్నీ చూస్తున్నట్లు తెలుస్తోంది. ఈ విషయంలో బన్నీ మనసేంటో తెలుసుకుందామంటే అతను మీడియాకు దొరకట్లేదు. ఐతే అతడికి అత్యంత సన్నిహితుడైన బన్నీ వాసు తాజాగా మీడియా ముందుకొచ్చాడు.

‘గీత గోవిందం’ ముచ్చట్లు అయిపోయాక విలేకరులందరూ అతడిని బన్నీ కొత్త సినిమా గురించే అడిగారు. దానికతను ఆసక్తికర సమాధానం ఇచ్చాడు. తనకు తెలిసి బన్నీ నుంచి త్వరలోనే రెండు భారీ అనౌన్స్మెంట్లు రాబోతున్నాయని చెప్పాడు. కానీ అవేమన్నది తాను ఇప్పుడు చెప్పలేనన్నాడు. బన్నీ ఒక స్క్రిప్టు లాక్ చేసే వరకు ఎవరికీ ఏదీ చెప్పడని.. అది జరిగాక తానే బన్నీ సినిమాలేవో ప్రకటిస్తానని.. అంత వరకు అభిమానులు ఆగాలని బన్నీ వాసు చెప్పాడు. ‘నా పేరు సూర్య’లో ఎంటర్టైన్మెంట్ తగ్గడం వల్లే ఆడలేదని భావిస్తున్న బన్నీ.. విక్రమ్ కుమార్ చెప్పిన స్క్రిప్టు మరీ సీరియస్ గా ఉందని చెప్పి ఎంటర్టైన్మెంట్ డోస్ పెంచాలని సూచించడం వల్లే ఈ సినిమా ఇంకా ఓకే కాలేదని తెలుస్తోంది. విక్రమ్ ఆ విషయంలో మెప్పించగానే సినిమా మొదలయ్యే అవకాశముంది.