రజనీకాంత్ ఇప్పట్లో అయ్యే పనికాదు కానీ..

0సూపర్ స్టార్ రజనీకాంత్ సినిమా రిలీజంటే ఒకప్పుడు థియేటర్ల దగ్గర హంగామా ఓ రేంజిలో ఉండేది. కలెక్షన్ల కనకవర్షం కురిసేది. సూపర్ స్టార్ సినిమా రిలీజ్ రైట్స్ దక్కించుకున్న డిస్ట్రిబ్యూటర్లు పండగ చేసుకునే వారు. కానీ ఇప్పుడు సీన్ మారింది. రజనీ సినిమాల్లో ఆనాటి ఊపు తగ్గింది. కబాలి సినిమాతో చాలామంది డిస్ట్రిబ్యూటర్లు నష్టపోయారు. ధైర్యం చేసి కాలా రైట్స్ తీసుకున్నవారంతా చేతులు కాల్చుకున్నామంటూ తెగ ఫీలవుతున్నారు.

ఇప్పుడు రజనీ ఫ్యాన్స్ అంతా ఆసక్తిగా ఎదురుచూస్తోంది 2.0 సినిమా కోసమే. భారీ చిత్రాల దర్శకుడు శంకర్ డైరెక్షన్ లో వస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలే ఏర్పడ్డాయి. అందుకే ఈ సినిమా కోసం డిస్ట్రిబ్యూటర్లు భారీగా అడ్వాన్సులిచ్చారు. కోలీవుడ్ లోనే కాకుండా ఆంధ్రా – తెలంగాణాల్లోనూ భారీ మొత్తాలే అడ్వాన్సులుగా ఇచ్చారు. నెలలు గడుస్తున్నాయే కానీ 2.0 థియేటర్లకు వచ్చే ఛాయలు కనిపించడం లేదు. అప్పులు తెచ్చి ఇచ్చిన అడ్వాన్సులకు వడ్డీ పెరుగుతోందే తప్ప సినిమా ఎప్పుడొస్తుందో చెప్పే నాథుడు లేకుండాపోయాడు.

దీంతో తమ అడ్వాన్సులు వెనక్కి తిరిగి ఇచ్చాయేలంటూ డిస్ట్రిబ్యూటర్ల నుంచి ప్రొడక్షన్ హౌస్ పై డిమాండ్ పెరుగుతోంది. దీనికితోడు రజనీ లేటెస్ట్ మూవీ కాలా సినిమా పరిస్థితి బాక్సాఫీస్ వద్ద ఏ మాత్రం బాగోలేదు. ఈ మూవీ ఫ్లాపని తేలిపోయింది. దీంతో ఎందుకొచ్చిన రిస్కని అడ్వాన్సులు రిటర్న్ ఇచ్చేయంటున్నారని తెలిసింది. 2.0 ఎప్పుడొస్తుందో తెలియనందున అడ్వాన్సులు తిరిగి ఇచ్చేస్తామని ప్రొడక్షన్ హౌస్ వాళ్లే చెబుతున్నారని నైజాం రైట్స్ తీసుకున్న సునీల్ నారంగ్ చెబుతున్నారు.