నన్ను ఏలియన్ లా చూశారు!

0రెహమత్ నగర్ దగ్గర కార్మికనగర్ లో ఓ చిన్న రూమ్. అందులో ఆరుగురు స్నేహితులు. అందరి లక్ష్యం ఒక్కటే. ఈసారి ఎలాగైనా ఆ ఒక్క ఛాన్స్ పట్టేయాలి. ఈ ఛాన్స్ మిస్సయితే వయసైపోతుంది. తర్వాత కొట్టడం చాలా కష్టం. ఇవీ కలలు. ఆ ఆరుగురూ రకరకాల డిపార్ట్ మెంట్ లలో నైపుణ్యం సంపాదించారు. ప్రయత్నాలు చేశారు. అందులో ఒకడు వెంకటేశ్ మహా. ఆరంభం లఘుచిత్రాలు తీసి మెప్పించాడు. రూమ్ లో ఉన్నపుడు కథలకు అవసరమైన పాయింట్లు రాసుకునేవాడు. వాటిని కథలు గా మార్చి ఎవరికైనా వినిపిస్తే నన్ను ఏలియన్ లా చూసేవారు. వీడేంటి వీడి కథలేంటి? అనేవారు. కానీ ఇప్పుడు అలా రాసుకున్న కథకే ఇన్ని అప్రీషియేషన్స్ అంటూ చెప్పుకొచ్చాడు మహా. తొలిసారి ఓ యూట్యూబ్ చానెల్ కోసం రూ.6000 బడ్జెట్ తో ఓ లఘుచిత్రం రూపొందించి శభాష్ అనిపించానని – అప్పుడప్పుడే లఘుచిత్రాల ట్రెండ్ మొదలైందని తెలిపాడు. విదేశాల్లో ఉన్న ఓ డాక్టర్ నిర్మాతగా మారి తనకు ఛాన్సివ్వడంతో లక్కు చిక్కిందిట. ఈ సంగతులన్నీ వెంకటేశ్ మహా నేడు రామానాయుడు స్టూడియోస్ లో జరిగిన పాత్రికేయుల చిట్ చాట్ లో వెల్లడించాడు.

కేరాఫ్ కంచరపాలెం చిత్రంతో దర్శకుడిగా అవకాశం రాక ముందు సెట్ డిజైనింగ్ కార్మికుడిగా పని చేశాడు. అక్కడ ఫుడ్డు కోసం పాట్లు తప్పవు కదా.. బోలెడన్ని ఎదుర్కొని.. తన ప్రయత్నాలు మాత్రం మానలేదు. అంతేనా స్వతహాగా నటుడు కావడంతో పలు చిత్రాల్లోనూ చిన్నా చితకా పాత్రలు చేశాడు. పవన్ కల్యాణ్ గంగతో రాంబాబు చిత్రంలో తన పేరు టైటిల్స్ లో వేశారు. ఇక మహాలో ఉన్న ఫ్యాషన్ ఏపాటిదో అతడి మాటల్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. నవతరంలో విషయం ఉన్నవాడిగా అతడి మాటలు చెబుతున్నాయి.

డైరెక్షన్ అంటే ఏదో ఇలా వచ్చి అలా చేసి వెళ్లిపోయేది కాదు. లైఫ్ని చూపించడమే దర్శకత్వం. దర్శకుడిగా పెద్ద స్థాయికి ఎదగాలన్నది నా పట్టుదల. నిజ జీవితాల్ని ప్రతిబింబిస్తూ ఆత్మ ఉన్నసినిమాలు తీయాలన్నది నా అభిమతం అని తెలిపారు. కేరాఫ్ కంచరపాలెం రిలీజ్ కి ముందే విమర్శకుల ప్రశంసలు అందుకుంది. పలువురు స్టార్లు – సెలబ్రిటీలు ఒక గొప్ప సినిమా వీక్షించామని ప్రివ్యూల అనంతరం ప్రశంసించారు. దాదాపు 1000 మందికి హైదరాబాద్ రామానాయుడు స్టూడియోస్ లో ప్రివ్యూ చూపించి వారి రివ్యూలు అడిగారుట. ఒక మంచి సినిమా చూశామన్న సమీక్షలు వచ్చాయని దర్శకుడు మహా ఆనందం వ్యక్తం చేశాడు. వైజాగ్ కంచెరపాలెం నేపథ్యంలో సాగే భిన్నమైన ప్రేమకథా చిత్రమిది. ఈ ఏడాది న్యూయార్క్ ఫిల్మ్ ఫెస్టివల్ కు ఎంపికైంది. రానా దగ్గుపాటి ఈ చిత్రాన్ని చూసి.. నచ్చి తనే విడుదల చేయడానికి ముందుకొచ్చాడు. ఇప్పుడు ఆయన సమర్పణలోనే విడుదలవుతోంది. న్యూయార్క్ కు చెందిన కార్డియాలజిస్ట్ విజయ ప్రవీణ పరుచూరి ఈ చిత్రాన్ని నిర్మించారు. ఎవరికీ తెలియకుండా సైలెంటుగా సినిమా తీశామని తెలిపాడు. ఈ సినిమాని అప్పే ట్రాలీ ఆటో అద్దెకు తీసుకుని అందులో ప్రయాణిస్తూ తీసిన రోజుల్ని గుర్తు చేసుకున్నాడు. ఈ శుక్రవారమే రిజల్ట్ రానుంది. ఇంట్రెస్టింగ్ బోయ్ .. ఆల్ ది బెస్ట్..