సామాన్యులకు ఎసరు పెట్టిన సెలబ్రిటీలు

0గడిచిన కొంతకాలంగా ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన బిగ్ బాస్ 2 సీజన్ స్టార్ట్ అయ్యింది. ఈసారి మరింత కొత్తగా.. ఏదైనా జరగొచ్చన్న కాన్సెప్ట్ తో వచ్చిన ఈ షోకు ఎంపికైన వారితో పోలిస్తే.. బిగ్ బాస్ సెట్ అదిరిపోయిందని చెప్పాలి. వావ్ అనిపించేలా ఉన్న బిగ్ బాస్ హౌస్ కు అంతా ఫిదా అయిపోయారని చెప్పాలి.

నాని హోస్ట్ చేస్తున్న ఈ షో.. తొలి రోజునే వివాదం మొదలైంది. సీజన్ 1లో వివాదాలు పెద్దగా లేని వైనం తెలిసిందే.ఆ లోటును భర్తీ చేసేలా మొదటిరోజునే బిగ్ బాస్ పెట్టిన ఫిట్టింగ్ తో సెలబ్రిటీలు తమ బుద్ధిని చూపించారన్న విమర్శ తెర మీదకు వచ్చింది.

గత సీజన్ కు భిన్నంగా ఈ సీజన్ లో సెలబ్రిటీలతో పాటు ముగ్గురు సామాన్యులకు అవకాశం లభించింది. హౌస్ మేట్స్ ను పరిచయం చేసిన తర్వాత.. బిగ్ బాస్ ఎంటరై.. అందరికి అభినందనలు తెలుపుతూ.. ఎంపిక చేసిన 16 మందిలో నచ్చని ఇద్దరి పేర్లు చెప్పాలని కోరారు.

దీనికి స్పందించిన సెలబ్రిటీలు సామాన్యుల కోటాలో షోకు ఎంపికైన ఇద్దరి పేర్లను చెప్పటం తాజా వివాదంగా మారింది. సామాన్యుల కోటాలో బిగ్ బాస్ కు ఎంపికైన వారిని చూస్తే.. విజయవాడకు చెందిన సంజనా అన్నేతో పాటు గణేశ్ ఉన్నారు. మూడో వ్యక్తిగా విశాఖపట్నానికి చెందిన నూతన్ నాయుడు ఉన్నారు. తొలిరోజునే సామాన్యులకు సెలబ్రిటీలు షాకివ్వటం అందరి దృష్టిని ఆకర్షించింది. షోకు ఎంపికైన వారిలో ఇద్దరు అనర్హుల పేర్లు చెప్పాలని బిగ్ బాస్ ఆదేశంతో కంటెంటెస్ట్ లు మూకుమ్మడిగా సామాన్యుల్ని టార్గెట్ చేశారు. సెలబ్రిటీలు అంతా సామాన్యుల కోటాలో వచ్చిన సంజనా.. నూతన్ నాయుడు పేర్లను సూచించారు. బిగ్ బాస్ ఆదేశాలతో వారిద్దరిని బిగ్ బాస్ హౌస్ లోని జైల్లో పెట్టి తాళం వేశారు. సోమవారం ఎపిసోడ్ లో వీరిలో ఒకరు విడుదలయ్యే అవకాశం ఉంది. ఇదిలా ఉంటే.. అనర్హుల పేర్లు చెప్పాలన్న బిగ్ బాస్ మాటకు.. సెలబ్రిటీలు అంతా సామాన్యుల పేర్లే చెప్పటం వివాదంగా రాజుకున్నట్లైంది. సెలబ్రిటీలు తమ బుద్ధిని చూపించారని.. సామాన్యల పట్ల తమకున్న చులకన భావాన్ని తమ తీర్పుతో చెప్పినట్లుగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

దీనికి తగ్గట్లే సంజనా కూడా సెలబ్రిటీలపై ఫైర్ అయ్యారు. సంజనా ఆగ్రహ క్లిప్ ను చూపించటం ద్వారా సోమవారం ఎపిసోడ్ మీద మరింత ఆసక్తిని పెంచేలా చేశారు. ఏదైనా జరగొచ్చంటూ అదే పనిగా చెప్పిన నాని మాటలకు తగ్గట్లే ఏదైనా జరగొచ్చన్న విషయాన్ని ఫస్ట్ డేనే అందరికి తెలిసేలా చేశారని చెప్పాలి. మరి.. ఈ వివాదం రానున్న రోజుల్లో మరెన్నిమలుపులు తిరుగుతుందో చూడాలి.