ప్యాంట్‌, షర్టు వేసుకునేవారిని అసలు అమ్మాయే అనరు

0Censor-Officials-insult-producer‘ప్యాంట్‌, షర్టు వేసుకునేవారిని అసలు అమ్మాయే అనరు’. ఓ మహిళా నిర్మాతను పట్టుకుని సెన్సార్‌ బోర్డు అధికారి అన్న మాటలివి. బాలీవుడ్‌ నటుడు నవాజుద్దీన్‌ సిద్దిఖి కథానాయకుడిగా నటించిన చిత్రం ‘బాబూమోషాయ్‌ బందూక్‌బాజ్‌’. కుషన్‌ నంది దర్శకుడు. ఈ చిత్ర ట్రైలర్‌ ఇటీవల విడుదలైంది. అయితే ట్రైలర్‌లో అసభ్యకర సన్నివేశాలు, పదాలు ఎక్కువగా ఉన్నాయని సెన్సార్‌ బోర్డు 48 సన్నివేశాలు కత్తిరించాల్సిందిగా ఆదేశించింది.

తాజాగా ఈ చిత్ర నిర్మాత కిరణ్‌ ష్రాఫ్‌ సినిమా గురించి మీడియా ద్వారా స్పందించారు. ‘సెన్సార్‌ బోర్డు సినిమా చూశాక మమ్మల్ని గంటసేపటి వరకు వెయిట్‌ చేయించారు. అప్టటికీ అనుకుంటూనే ఉన్నా సెన్సార్‌ బోర్డు సినిమా గురించి ఏదో ఒక గొడవ చేస్తుందని. గంట తర్వాత మమ్మల్ని లోపలికి రమ్మన్నారు. కనీసం కూర్చోమని కూడా చెప్పలేదు. అంతేకాదు సెన్సార్‌ బోర్డ్‌కి చెందిన ఓ మహిళ.. ‘ఓ మహిళవై ఉండి ఇలాంటి సినిమా ఎలా తీస్తావు’ అని ప్రశ్నించింది. అప్పుడు మహిళ అయితే మాత్రం ఇలాంటి సినిమా ఎందుకు తీయకూడదు అన్నాను. దీనికి పక్కనే ఉన్న ఓ వ్యక్తి ‘అసలు ఆమె మహిళే కాదు. ఇలా ప్యాంట్‌, షర్టు వేసుకునేవారిని మహిళ అనరు’ అని నోటికొచ్చినట్లు మాట్లాడాడు. అది విని నేను నిర్ఘాంతపోయా. దీటుగా సమాధానం చెప్పాలనుకున్నాను కానీ గొడవెందుకని వదిలేశాను.’ అని వెల్లడించారు కిరణ్‌. ఈ చిత్రం ఆగస్ట్‌ 25న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.