ఆత్మహత్య చేసుకుందామనుకున్న చలపతిరావు

0chalapathi-commentsసీనియర్ నటుడు చలపతి రావు ఓ చెత్త విషయంతో వార్తల్లోకి వచ్చేశారు. మూడు రోజుల నుంచి ఆయన పేరు మీడియాలో మార్మోగిపోతోంది. ‘రారండోయ్ వేడుక చూద్దాం’ ఆడియో వేడుకలో మహిళల్ని ఉద్దేశించిన ఆయన చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారమే రేపాయి. మీడియాలో ఆయన పెద్ద విలన్ అయిపోయాడు. చలపతిరావు వ్యాఖ్యలు తీవ్ర అభ్యంతరకరమే. వాటిని ఎవరైనా ఖండించాల్సిందే. ఐతే ఈ వ్యాఖ్యల్ని పక్కన పెట్టి చూస్తే.. ఆయన జీవితంలో వేరే కోణాలూ ఉన్నాయి. పెళ్లయిన కొన్నేళ్లకే భార్యను పోగొట్టుకుని పెద్ద విషాదమే చూశారు చలపతిరావు. ఆ సమయంలో ఆత్మహత్య చేసుకోవాలన్న ఆలోచన కూడా కలిగిందని ఓ ఇంటర్వ్యూలో చెప్పారు చలపతిరావు.

పెళ్లయిన కొంత కాలానికే తన భార్య చనిపోయిందని.. అప్పటికి తనకు ముగ్గురు పిల్లలు ఉండటం.. ఆదాయం అంతంతమాత్రంగా ఉండటం.. ఆర్థిక సమస్యల్లో కొట్టుమిట్టాడుతుండటంతో ఆత్మహత్య చేసుకోవాలన్న ఆలోచన కలిగినట్లు చలపతిరావు తెలిపారు. ఐతే తర్వాత ఆ ఆలోచన మానుకుని పిల్లల కోసం బతకాలని నిర్ణయించుకున్నట్లు చెప్పారు. మరో పెళ్లి చేసుకోమంటూ సీనియర్ ఎన్టీఆర్.. ఆయన సతీమణి బసవతారకమ్మ ఎంతో బలవంత పెట్టినా తాను అలా చేయలేదని.. ఒంటరిగా పిల్లల్ని పోషించానని.. ఆ సమయంలో బస్సు ఎక్కితే పది పైసలు ఖర్చవుతుందని భావించి.. పది కిలోమీటర్ల దూరంలో ఉన్న స్టూడియోకు నడిచి వెళ్లేవాడినని చలపతి రావు గుర్తు చేసుకున్నారు. చిన్న పాత్ర అయినా నో చెప్పకుండా అన్నీ చేసుకుంటూ వెళ్లానని.. రూపాయి రూపాయి చేర్చి పెట్టి ముగ్గురు పిల్లల్ని గ్రాడ్యుయేట్లను చేశానని.. వాళ్లు జీవితంలో స్థిరపడేలా చేశానని చలపతిరావు చెప్పుకొచ్చారు.