ఐవైఆర్ కృష్ణారావుకు జగన్ హామీ..?

0IYR-and-Jagan2019 ఎన్నికల్లో విజయవాడ సెంట్రల్ శాసన సభ నియోజకవర్గ టిక్కెట్‌ను మాజీ సీఎస్ ఐవైఆర్ కృష్ణా రావు అడిగారా? అందుకు సీఎం చంద్రబాబు నాయుడు నిరాకరించారా? దీంతోనే వివాదం వచ్చిందా? అంటే అవుననే వాదనలు వినిపిస్తున్నాయి.

ఐవైఆర్ కృష్ణారావు ఏపీ సీఎస్‌గా పని చేశారు. ఆ తర్వాత ఆయనను బ్రాహ్మణ సంఘం వెల్ఫేర్ అసోసియేషన్‌గా చంద్రబాబు నియమించారు. అయితే, ఇటీవల ఆయన చంద్రబాబును, టిడిపి ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ ఫేస్‌బుక్ పోస్టులు పెట్టారు.

ఇది కలకలం రేపుతోంది. విమానాశ్రయంలో ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి తీరును ఐవైఆర్ కృష్ణారావు వ్యతిరేకించడం, ఇంటూరి రవి కిరణ్ ‌అరెస్టును ప్రశ్నించడం వంటి అంశాలు టిడిపి ఆగ్రహానికి గురయ్యాయి. అయినప్పటికీ మౌనంగానే ఉన్నారు.

అయితే ఏకంగా ప్రభుత్వాన్ని టార్గెట్ చేయడాన్ని ప్రశ్నిస్తున్నారు. ఐవైఆర్ కృష్ణారావు ప్రభుత్వంపై విమర్శలు చేయడం వెనుక రహస్యం వేరే ఉందనే విషయం వెలుగు చూస్తోంది. ఆయన విజయవాడ సెంట్రల్ సీటు కావాలని చంద్రబాబును అడిగారని తెలుస్తోంది.

2019 ఎన్నికల్లో తాను ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తానని, తనకు సీటు ఇవ్వాలని కోరారని తెలుస్తోంది. ఇందుకు చంద్రబాబు నో చెప్పారని సమాచారం. ఈ కారణంగానే కృష్ణారావు ఎదురు తిరిగారనే ప్రచారం సాగుతోంది.

ఐవైఆర్ కృష్ణారావు కోరుకున్న విజయవాడ సెంట్రల్ టిక్కెట్‌ను ఇస్తానని వైసిపి అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి నుంచి ఆయనకు హామీ వచ్చి ఉంటుందని అంటున్నారు. అందుకే ఐవైఆర్ అడుగులు ఆ దిశగా కనిపిస్తున్నాయనే వాదనలు వినిపిస్తున్నాయి. చంద్రబాబు ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోస్టులు పెట్టడం, వైసిపికి చెందిన సామాజిక వర్గం నేతలతో మాట్లాడటం జరిగింది. ఇది చూస్తుంటే జగన్ నుంచి టిక్కెట్ హామీ వచ్చి ఉంటుందని, అంతుకే ఇప్పుడు ప్రభుత్వంపై విమర్శలు చేస్తుండవచ్చుననే వాదనలు వినిపిస్తున్నాయి.