రాష్ట్ర ఫోరెన్సిక్‌ ల్యాబ్‌ భవన సముదాయ నిర్మాణానికి భూమిపూజ

0forginsic-labఫ్యాక్షనిస్టులు, దొంగలు, రౌడీలు ఉండాల్సిన స్థలం ఆంధ్రప్రదేశ్‌ కాదని, నేరాల అదుపులో ప్రభుత్వం గట్టిగా వ్యవహరిస్తుందని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. రాజధాని అమరావతిలోని తుళ్ళూరులో రాష్ట్ర ఫోరెన్సిక్‌ ల్యాబ్‌ భవన సముదాయ నిర్మాణానికి గురువారం భూమిపూజ చేశారు. దీనిని రూ.254 కోట్ల వ్యయంతో నిర్మించనున్నారు. ఈ ల్యాబ్‌ ప్రపంచానికే తలమానికంగా ఉండాలని ముఖ్యమంత్రి ఆకాంక్షించారు. పోలీసుస్టేషన్లలో ఎన్ని కేసులు నమోదు చేశామన్నది కాకుండా… నేరాలను అదుపు చేసేందుకు చేపట్టే చర్యలు ఎలా ఉండాలో గ్రహించాలని పోలీసు ఉన్నతాధికారులకు ఉద్బోధించారు. న్యాయస్థానాల్లో తేలికగా తప్పించుకోవచ్చనే భావనతో నేరస్థులు ఆలోచిస్తున్నారని, వారి ఆటలు కట్టించాలంటే పోలీసులు నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలని సూచించారు. తలపెట్టిన ల్యాబ్‌లో ఉన్నతమైన సాంకేతికను అభివృద్ధి చేయాలన్నారు. సాంకేతికత ఎప్పుడైతే అభివృద్ధి చెందుతుందో అప్పుడే నేరాలు అదుపులోకి వస్తాయన్నారు. ‘‘ఎవరు చూసినా రాజధాని అమరావతిని ప్రపంచ స్థాయి సిటీ అంటున్నారు. ప్రపంచ స్థాయి సిటీగా కాదు.. ప్రపంచ మేటిగా ఉండాలని మనం కోరుకోవాలి’’ అని ముఖ్యమంత్రి అన్నారు. డీజీపీ నండూరి సాంబశివరావు మాట్లాడుతూ ఫోరెన్సిక్‌ ల్యాబోరేటరీ అమరావతికి చిరునామా కానుందన్నారు. ల్యాబ్‌ సలహాదారు ప్రొఫెసర్‌ గాంధీ మాట్లాడుతూ దేశంలోనే మొట్టమొదటిసారిగా గతంలో డీఎన్‌ఏ ల్యాబ్‌ను, సైబర్‌క్రైం ల్యాబ్‌ను మనం తెచ్చుకున్నామని అన్నారు. ‘‘గుజరాత్‌లోని గోద్రాలో జరిగిన అల్లర్ల సమయంలో బ్రిటన్‌కు చెందిన ఇద్దరు చనిపోయారు. తొలుత వారి ఎముకలను లండన్‌కు పంపి వివరాలు సేకరిద్దామనుకొన్నాం. తర్వాత హైదరాబాద్‌ ఫోరెన్సిక్‌ ల్యాబ్‌లో కాలిపోయిన ఎముకలను పరీక్షించి మరణించిన వారి వివరాలు తెలుసుకొన్నాం. బ్రిటిష్‌ రాయబారుల మన్ననలు పొందాం. అలాగే ఇక్కడ నిర్మించే ఫోరెన్సిక్‌ ల్యాబ్లో నేరపరిశీలన, పరిశోధన అంశాలే కాకుండా శిక్షణ కేంద్రాన్ని కూడా అభివృద్ధి చేయాలని భావిస్తున్నాం’’ అని ఆయన ముఖ్యమంత్రికి వివరించారు. కార్యక్రమంలో మంత్రి పి.నారాయణ, తాడికొండ ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్‌కుమార్‌, హోంశాఖ ముఖ్యకార్యదర్శి అనూరాధ, సీఐడీ విభాగం ఐజీ ద్వారాకా తిరుమలరావు, విజయవాడ నగర పోలీసు కమిషనర్‌ గౌతమ్‌సవాంగ్‌, గుంటూరు రూరల్‌ ఎస్పీ వెంకటఅప్పలనాయుడు, ఇతర పోలీసు అధికారులు పాల్గొన్నారు.

కనీసం బాస్‌కి ఫోన్‌ అయినా చేయని వైనం.. కొన్ని రోజుల కిందటే ఖరారైన ఈ కార్యక్రమానికి సీఎంను ఆహ్వానించిన పోలీసు అధికారులు తమ శాఖ మంత్రి, ఉపముఖ్యమంత్రి అయిన చినరాజప్పను మాత్రం పిలవలేదు. ఆహ్వానపత్రంలో ఆయన పేరు వేసినప్పటికీ.. నేరుగా కలిసి ఆహ్వానం అందించడం లేదా ఫోన్‌ చేసి కార్యక్రమానికి రమ్మని కోరడం వంటివేమీ చేయలేదు. మిగతా వారికి ఇచ్చినట్లే మంత్రి పేషీలో ఓ ఆహ్వానపత్రం ఇచ్చేసి వెళ్లిపోయారు. దీంతో ఆ సమాచారం లేక ఆయన కార్యక్రమానికి వెళ్లలేదు. శంకుస్థాపనలో చినరాజప్ప ఎక్కడా కనిపించకపోవడంతో ముఖ్యమంత్రి చంద్రబాబు ఆయన గురించి ఆరా తీశారు. అప్పుడు ఆహ్వానం అందని విషయం వెలుగుచూసింది. అధికారుల తీరు పట్ల సీఎం అసహనం వ్యక్తం చేసినట్లు తెలిసింది. తాను తిరుపతి వెళ్లాల్సి ఉన్నందునే ఈ కార్యక్రమానికి హాజరుకాలేకపోయానని చినరాజప్ప ‘ఈనాడు’కు చెప్పారు.