సమరసింహారెడ్డి నిర్మాత ఇప్పుడలా ఉన్నారట!

0కొన్ని తప్పులు ఎలాంటోడినైనా.. మరెలానో మార్చేస్తాయి. ఊహించని రీతికి తీసుకెళతాయి. తాజాగా వెలుగు చూసిన వైనం చూస్తే.. అవాక్కవ్వాల్సిందే. బాలకృష్ణ కెరీర్ ను మరో రేంజ్ కి తీసుకెళ్లిన మూవీ సమరసింహారెడ్డి. అంతటి సూపర్ డూపర్ హిట్ మూవీ తీసిన నిర్మాత చెంగల వెంకట్రావు గుర్తున్నాడా?

హడావుగా ఉండే ఆయన ఒక దశలో ఎమ్మెల్యేగా వ్యవహరించారు కూడా. పోస్టర్ల మీద తన ఫోటో వేసుకుంటూ ఒక వెలుగు వెలిగిన ఆయన తాజా పరిస్థితి తెలిస్తే అవాక్కు అవ్వాల్సిందే. ఓడలు బండ్లు కావటం అంటే ఎలానో ఆయన్ను చూస్తే ఇట్టే అర్థమైపోతుంది.

సినీ నిర్మాతగా సుపరిచితుడు.. 2004 ఎన్నికల్లో పాయకరావు పేట ఎమ్మెల్యేగా గెలుపొంది.. 2009 ఎన్నికల్లో ఓడిన ఆయన.. 2014లోనూ పరాజయం పాలయ్యారు. అయితే.. 2007లో నక్కపల్లి మండలం బంగారమ్మపేట బీచ్ మినరల్స్ కంపెనీకి వ్యతిరేకంగా జరిగిన గొడవలో ఒక మత్స్యకారుడు మరణించాడు.

ఈ హత్య కేసు చెంగల వెంట్రావు మెడకు చుట్టుకుంది. ఆయన మద్దతుదారులే చంపారన్న ఆరోపణ ఉంది. దీనిపై దాదాపు పదేళ్లు విచారణ జరిగిన అనంతరం.. చెంగల దోషిగా నిరూపితమై.. యావజ్జీవ కారాగారశిక్షను కోర్టు విధించింది. కట్ చేస్తే.. తాజాగా కేజీహెచ్ ఆసుపత్రిలో మలేరియా బారిన పడిన బాధితుల్ని పరామర్శించేందుకు జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్ వచ్చారు.

అందరి ఖైదీల మాదిరే చెంగలనను పలుకరించారు. అయితే.. ఆయన గతంలో సినిమా నిర్మాత అని.. మాజీ ఎమ్మెల్యే అన్న విషయాన్ని తెలుసుకొని ఒకింత ఆశ్చర్యపోయారు. గుర్తు పట్టలేని రీతిలో మారిన ఆయన.. ఒద్దికగా.. చేతులు కట్టుకొని దీనంగా నిలుచున్న తీరును చూస్తే.. ఎవరైనా అవాక్కు అవ్వాల్సిందే. కొన్ని తప్పులు ఎంత ఖరీదైనవో చెంగల పెద్ద ఉదాహరణగా చెప్పక తప్పదు.