చికాగో సెక్స్ రాకెట్..హైదరాబాదీలకు షాక్

0షికాగోలోని ఓ తెలుగు చిత్రాల సహా నిర్మాత సినిమా అవకాశాలు లేని హీరోయిన్లను వ్యభిచారానికి ప్రోత్సహించిన ఘటన సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. షికాగోలో సెక్స్ రాకెట్ వెలుగు చూడటం హైదరాబాద్ కేంద్రంగా ఉన్న తెలుగు వారికి షాక్ ను ఇస్తోంది. ప్రధానంగా అమెరికా వెళ్లాలనుకునే వారికి ఊహించని షాక్ తగులుతోంది. యూఎస్ వీసా అధికారులు ఏ మాత్రం అనుమానం వచ్చినా రెడ్ మార్క్ పెడుతున్నారు. అమెరికా విశ్వవిద్యాలయాల్లో చదువుకుంటున్న తమ పిల్లల గ్రాడ్యుయేషన్ కు వెళ్లేందుకు వీసా కోసం దరఖాస్తు చేసిన తల్లిదండ్రులకూ తిప్పలు తప్పడం లేదు. గ్రాడ్యుయేషన్ కోసం వెళతామన్న తల్లిదండ్రులు – బంధువుల్లో 90 శాతం మందికి వీసాలు మంజూరవుతాయి.

అమెరికాకు వెళ్లాలనుకునే వారు వీసా కోసం ఆన్ లైన్ లో డీఎస్ 160 ఫామ్ సమర్పించాలి. ఆ ఫామ్ లో పేర్కొన్న వివరాల ఆధారంగా వీసా ఇవ్వాలా? లేదా? అన్న నిర్ణయానికి వస్తారు. అందులో దరఖాస్తుదారులకు చెందిన ఆర్థిక పరిస్థితి.. ఆస్తులు తదితర వివరాలు చూస్తారు. తిరిగి వస్తారా? లేదా? అనే అంశాలను పరిశీలిస్తారు. కానీ షికాగో ఘటన తర్వాత తెలుగు సదస్సులకు వెళ్లే 90 శాతం మంది వీసా దరఖాస్తులను తిరస్కరిస్తున్నారు. గతంలో దరఖాస్తు చేసిన వారిలో 90 శాతం మందికి వీసాలు వచ్చేవి కాగా ప్రస్తుతం దాదాపు 50 శాతం రిజెక్ట్ అవుతున్నాయి. గత ఒక్కనెలలోనే ఆరు వందల వీసాలు రిజెక్ట్ అయినట్లు తెలుస్తోంది.

షికాగోలో సెక్స్ రాకెట్ వెలుగు చూడటం.. ఆ మొత్తం వ్యవహారంలో తెలుగు అసోసియేషన్ అఫ్ నార్త్ అమెరికా(తానా) ప్రతినిధుల ప్రమేయం ఉంటడంతో తెలుగు సదస్సులకు వెళ్లేవారి దరఖాస్తులను కాన్సులేట్ పూర్తిగా పరిశీలిస్తోంది. ఏ మాత్రం అనుమానం వచ్చినా రెడ్ మార్క్ పెడుతోంది. దీంతో సినీ – టీవీ కళాకారులకు వీసాలు రాని పరిస్థితి ఎదురైంది. షికాగో సెక్స్ రాకెట్ మూలంగా తెలుగువారి పరువు పోవడంతో పాటుగా…నగరంలోని వారికి సైతం బ్యాడ్ టైం మొదలైందని పలువురు వాపోతున్నారు.