చింతమనేనికి మహిళలంటే చులకనా?

0chintamaneni-prabhakarచంద్రబాబుకు బాగా ఇష్టమైన జిల్లా పశ్చిమగోదావరిలోని దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ మరోసారి రెచ్చిపోయారు. ఆడవాళ్లను చూస్తే ఆయనకు బూతులు తిట్టాలనిపిస్తుందో ఏమో నోటికొచ్చినట్లు మాట్లాడేస్తున్నారు. ఆ మధ్య అంగన్ వాడీ మహిళలు జీతాలు పెంచాలని వినతిపత్రం ఇచ్చేందుకు వెళ్తే… కోడిగుడ్లు అమ్ముకునే మీకెందుకే జీతాలు అంటూ బూతులు తిట్టిన చింతమేని… ఈసారి మధ్యాహ్న భోజన మహిళా కార్మికులపై విరుచుకుపడ్డారు. వేతనాలు పెంచాలంటూ మధ్యాహ్నం భోజన పథకం కార్మికులు కలెక్టరేట్ ఎదుట ధర్నా చేయగా.. వారిని చూసి అక్కడ ఆగి మరీ బూతులు తిట్టి వెళ్లారు.

పశ్చిమగోదావరి కలెక్టరేట్ ఎదురుగా మధ్యాహ్న భోజన కార్మికులు ధర్నా చేస్తున్న సమయంలోనే జెడ్పీ అతిథి గృహానికి వెళ్తున్న చింతమనేని .. ధర్నా శిబిరం వద్దకు వచ్చారు. ఎందుకు ధర్నా చేస్తున్నారని ప్రశ్నించారు. దీంతో వారు కారణాలు చెప్పారు. అంతే చింతమనేని బూతులు బయటకు వచ్చాయి. ”తిన్నది అరగక కొట్టుకుంటున్నాయి” మహిళలను అందరూ చూస్తుండగానే బూతులు తిట్టారు.

అంతలోనే… ధర్నాలో దెందులూరు నియోజకవర్గానికి చెందిన వారు కూడా పాల్గొన్నరని అనుచరులు చెప్పడంతో చింతమనేని మరింత రెచ్చిపోయారట. ‘‘ధర్నాలో పాల్గొన్న మన నియోజకవర్గం వారి ఫోటోలను తియండి. వాళ్ల సంగతి తేలుద్దాం. ఉద్యోగం తీయించి పంపిద్దాం. అరగక కొట్టుకుంటున్నారు” అంటూ వీరంగం వేశారు. చింతమనేని బూతు రూపాన్ని ఓ చానల్ విలేకరి చిత్రీకరిస్తుండంగా అతడిపైకి చింతమనేని అనుచరులు దాడి చేయడమే కాకుండా చింతమనేని కూడా ఆయన్ను కొట్టినట్లు చెబుతున్నారు. దీంతో విలేకరులంతా చింతమనేనికి వ్యతిరేకంగా ధర్నాలు చేస్తున్నారు.

మరోవైపు చింతమనేని తీరుపై మహిళలంతా మండిపడుతున్నారు. మహిళల భద్రతపై చంద్రబాబు ఎంతో చిత్తశుద్ధి చూపిస్తున్నా ఆయన పార్టీకి చెందిన చింతమనేని మాత్రం మహిళలపై అరాచకాలకు పాల్పడుతున్నారని ఆరోపిస్తున్నారు.