తప్పు ఒప్పుకున్న చిరు

0నిన్న జరిగిన తేజ్ ఐ లవ్ యు ఆడియో ఫంక్షన్ లో ముఖ్య అతిధిగా వచ్చిన మెగాస్టార్ చిరంజీవి ఆ సినిమా కంటే నిర్మాతతో తనకున్న వ్యక్తిగత బాండింగ్ గురించే ఎక్కువ సేపు మాట్లాడ్డం విశేషం. 80వ దశకంలో తనతో నాలుగు సూపర్ హిట్స్ నిర్మించిన కెఎస్ రామారావు మరణ మృదంగం సినిమాతో తనకు మెగాస్టార్ అనే బిరుదును ఫిక్స్ చేయటం గురించి ఈ సందర్బంగా గుర్తు చేసుకున్న చిరు తమ మధ్య గ్యాప్ రావడానికి గల కారణాలు కూడా స్టేజి మీదే ఓపెన్ గా చెప్పేసారు. 1991లో యండమూరి దర్శకత్వంలో స్టూవర్టుపురం పోలీస్ స్టేషన్ సినిమాకు దర్శకుడిని మారిస్తే బాగుంటుంది అని కెఎస్ రామారావు తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసినప్పుడు తానే అలా వద్దు ఆయన మీద నమ్మకం పెడదామని కన్విన్స్ చేశారట. తీరా చూస్తే చివరికి సినిమా దారుణంగా పరాజయం పాలయింది. ఎంతగా అంటే చిరంజీవితో కెఎస్ రామారావు మళ్ళి ఇంకో సినిమా చేయలేనంతగా. ఈ ఫ్లాష్ బ్యాక్ నే చిరు చెబుతూ ఆ రోజు రామారావు గారు వద్దన్నా నా మాట మీద ఆ సినిమా తీసారని కాబట్టి ఆ ప్లాప్ కు తానే బాధ్యుడిని అని ఒప్పేసుకున్నారు.

చిరు చెప్పిందాంట్లో అతిశయోక్తి లేదు. నిజంగా చిరు ఇమేజ్ పీక్స్ లో ఉన్న ఆ టైంలో ప్లాప్ సినిమాలు సైతం ఇతర హీరోల హిట్ మూవీస్ కలెక్షన్స్ తెచ్చి పెట్టేవి. కానీ స్టూవర్టుపురం పోలీస్ స్టేషన్ ఒక్కటే తీవ్ర నష్టాల పాలయ్యేంత డిజాస్టర్ అయ్యింది. దాని తర్వాత వెంకటేష్ తో చంటి తీసి కెఎస్ రామారావు వెంటనే రికవర్ అయ్యారు. ఇదంతా కావాలని చేసింది కాదు కానీ అలా మిస్ ఫైర్ అయ్యింది అని చిరు ప్రత్యేకంగా దాని గురించి వివరించడం ఫాన్స్ ను టైం మెషిన్ లో వెనక్కు తీసుకెళ్లింది.తేజు తన మేనల్లుడు కాబట్టి ఈ వేడుకకు రాలేదని కేవలం కెఎస్ రామారావుతో ఉన్న స్నేహమే అని కుండబద్దలు కొట్టారు. అది నిజమే. ఎందుకంటే తేజ్ లాస్ట్ మూవీ ఇంటెలిజెంట్ ఈవెంట్ కి దర్శకుడు వివి వినాయక్ ఎంత ఇష్టుడైనా చిరు వెళ్ళలేదు. కానీ తేజ్ ఐ లవ్ యు కి మాత్రం వచ్చారు. సో అక్కడ డౌట్ పడడానికి ఏమి లేదు. పరాజయాలకు దర్శకులే బాధ్యులు అని చెప్పుకునే రోజుల్లో చిరు హుందాగా ఆ రోజు తాను తీసుకున్న తప్పుడు నిర్ణయం వల్లే ఒక నిర్మాత నష్టపోయారు అని చెప్పడం ఎంతైనా హర్షించదగినదే.