‘గీత గోవిందం’ సక్సెస్ మీట్ లో చిరు?

0గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ పై.. విజయ్ దేవరకొండ – రష్మిక ల కాంబోలో పరశురామ్ తెరకెక్కించిన `గీత గోవిందం` బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్ల సునామీ సృష్టిస్తోన్న సంగతి తెలిసిందే. బన్నీవాసు నిర్మాతగా వ్యవహరించిన ఈ చిత్రం రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్ లోనూ భారీ వసూళ్లను రాబడుతోంది. తొలి రెండు రోజుల్లోనే దాదాపు 25 కోట్ల గ్రాస్ వసూలు చేసిన ఈ చిత్రం…వీకెండ్ లో మరిన్ని కలెక్షన్లు రాబడుతుందని చిత్ర యూనిట్ ధీమాగా ఉంది. ఇప్పటికే నిర్మాతకు – డిస్ట్రిబ్యూటర్లకు లాభాల పంట పండిస్తోన్న ఈ సినిమా సక్సెస్ మీట్ ను ఏర్పాటు చేయాలని చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తోంది. ఆదివారం నాడు `గీత గోవిందం` సక్సెస్ మీట్ ను హైదరాబాద్ లోని కోట్ల విజయ భాస్కర్ రెడ్డి స్టేడియంలో ఏర్పాటు చేశారని తెలుస్తోంది. అంతేకాదు ఆ వేడుకకు మెగా స్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరు కాబోతున్నట్లు తెలుస్తోంది.

హైదరాబాద్ లోని కోట్ల విజయ భాస్కర్ రెడ్డి స్టేడియంలో ఆదివారం సాయంత్రం 6 గంటల ఈ సక్సెస్ మీట్ ఈవెంట్ ప్రారంభం కానుందని తెలుస్తోంది. ఈ వేడుకకు ముఖ్య అతిథిగా చిరంజీవి హాజరుకాబోతున్నారని కూడా వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే  ఈ సినిమా చూసిన చిరు….విజయ్ ను – చిత్ర యూనిట్ ను అభినందించిన సంగతి తెలిసిందే. వాస్తవానికి ఈ చిత్రం ఆడియో రిలీజ్ ఈవెంట్ కు చిరు రావాల్సింది. కానీ సైరా షూటింగ్ లో బిజీగా ఉన్న చిరంజీవి ఆ కార్యక్రమానికి హాజరు కాలేకపోయారు. దీంతో సక్సెస్ మీట్ కు చిరు తప్పక హాజరు కానున్నట్లు తెలుస్తోంది. మరోవైపు   ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా విజయ్ దేవరకొండ – రష్మిక మందన ‘బిగ్ బాస్ 2’ హౌస్ లో సందడి చేయనున్నట్లు తెలుస్తోంది.