దర్శకుల సంఘానికి చిరు 25 లక్షలు

0

దర్శకులకు గౌరవాన్ని తీసుకొచ్చిన దిగ్గజం దర్శకరత్న దాసరి నారాయణరావు. ఆయన జయంతిని డైరెక్టర్స్ డేగా ప్రకటించి గత ఏడాది నుంచి ఉత్సవాలు జరుపుకుంటున్న విషయం తెలిసిందే. ఈ ఏడాది శనివారం దాసరి జయంతి సందర్భంగా దర్శకుల సంఘం సభ్యులు డైరెక్టర్స్ డేని హైదరాబాద్ లో అత్యంత వైభవంగా నిర్వహించింది. `సైరా` చిత్రీకరణలో బిజీగా ఉన్న మెగాస్టార్ చిరంజీవి ప్రత్యేకంగా ఈ కార్యక్రమానికి వచ్చారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆయన డైరెక్టర్స్ అసోసియేషన్ కు సంబంధించిన `టిఎఫ్ డిఎ డాట్ ఇన్` పేరుతో ఏర్పాటు చేసిన వెబ్ సైట్ ని ప్రారంభించారు. దర్శకుడు దాసరి నారాయణరావుతో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్న చిరు ఆయనతో `లంకేశ్వరుడు` తప్ప మరో సినిమా చేయలేదని.. దాసరితో ఎక్కువ చిత్రాలు చేయలేనందుకు బాధగా వుందని అన్నారు.

అయితే తెలుగు చలన చిత్ర సీమలో ఎంత మంది దిగ్దర్శకులున్నా దాసరి ప్రత్యేకత ఎవరికీ రాదని ఆయనను మించిన వారు ఇక రారని దాసరిపై ప్రశంసలు కురిపించారు. ఆయన లేని లోటు అలానే ఉందని అన్నారు. ఈ సందర్భంగా దర్శకుల సంఘం సహాయనిధికి తన వంతు బాధ్యతగా 25 లక్షల విరాళాన్ని మెగాస్టార్ ప్రకటించారు. గతంలో ప్రకృతి విళయాల వేళ ఇంతే ధారాళంగా విరాళాలు ప్రకటించిన చిరంజీవి తాజాగా మరోసారి పెద్ద మొత్తాన్ని విరాళంగా ప్రకటించడం అందరిలో చర్చకు వచ్చింది.

ఇటీవల తన పేరుతో ఏర్పాటు చేసిన ఛారిటబుల్ ట్రస్ట్ ద్వారా చిరు ప్రత్యేక సందర్భాల్లో ఆపన్నుల కోసం దాన ధర్మాలు చేస్తున్నారు. మొన్నటికి మొన్న రాఘవ లారెన్స్ హైదరాబాద్ ట్రస్ట్ కు 10 లక్షలు విరాళం ఇచ్చిన ఆయన క్యాన్సర్ తో బాధపడుతున్న నటి అల్లరి సుభాషిణికి తన వంతు సాయం అందించారు. చిన్న కుమార్తె శ్రీజ ద్వారా ఆర్థిక సహాయాన్ని ఆమె ఇంటికే పంపించి ఆశ్చర్యపరిచారు. హైదరాబాద్ ఎల్లారెడ్డి గూడ పరిసరాల్లోని దర్శక సంఘంలో ప్రత్యేకించి దర్శకులంతా శనివారం సాయంత్రం సెలబ్రేషన్స్ చేసుకున్నారు.
Please Read Disclaimer