అమ్మ చేతుల మీదుగా ‘చిరు’ టీజర్

0మెగా అభిమానుల నిరీక్షణ ఫలించింది. మెగాస్టార్ చిరంజీవి కొత్త సినిమా ‘సైరా నరసింహారెడ్డి’ టీజర్ ఈ రోజే లాంచ్ అయింది. రేపు చిరు పుట్టిన రోజును పురస్కరించుకుని ఈ రోజే టీజర్ రూపంలో కానుక ఇచ్చేసింది చిత్ర బృందం. ఈ టీజర్ కు అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది. విశేషం ఏంటంటే.. ఈ టీజర్ మెగాస్టార్ తల్లి అంజనాదేవి చేతుల మీదుగా రిలీజైంది. ఆమె బయటి వేడుకల్లో కనిపించడం అరుదు. ఐతే చిరు కెరీర్లో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న సినిమా టీజర్ ను తన నానమ్మ చేతుల మీదుగానే లాంచ్ చేయించాలని రామ్ చరణ్ ఫిక్సయ్యాడు. ఈ చిత్రానికి అతనే నిర్మాత అన్న సంగతి తెలిసిందే. టీజర్ లాంచ్ ను ఆడియో వేడుకో.. ప్రి రిలీజ్ ఈవెంటో చేసినట్లుగా కొంచెం ఘనంగానే ఈ కార్యక్రమాన్ని నిర్వహించాడు చరణ్.

మెగాస్టార్ తప్పిస్తే చిత్ర బృందంలోని కీలక వ్యక్తులందరూ ఈ వేడుకకు హాజరయ్యారు. అంజనాదేవితో పాటు చిరు సతీమణి సురేఖ కూడా వచ్చారు. చరణ్ వాళ్లిద్దరినీ వేదిక ఎక్కించి మాట్లాడించడం విశేషం. ఇంకా దర్శకుడు సురేందర్ రెడ్డి.. చిత్ర రచయితలు పరుచూరి గోపాలకృష్ణ.. పరుచూరి వెంకటేశ్వరరావు.. సాయిమాధవ్ బుర్రా తదితరులు ఈ వేడుకలో పాల్గొన్నారు. అందరూ సినిమా గురించి గొప్పగా మాట్లాడారు. ఇప్పటికే 50 శాతానికి పైగా చిత్రీకరణ జరుపుకుంది ‘సైరా’. సినిమాలో అత్యంత కీలకమైన సన్నివేశాల షూటింగ్ పూర్తయింది. టీజర్లో వాటికి సంబంధించిన విజువల్సే చూపించారు. మిగతా షూటింగ్ ఈ ఏడాది చివరికల్లా పూర్తి చేయాలన్న ప్రణాళికతో ఉంది సురేందర్ రెడ్డి టీం. వచ్చే ఏడాది వేసవికి ‘సైరా’ను ప్రేక్షకుల ముందుకు తేవాలని అనుకుంటున్నారు.