చిరు ఇక గుడ్ బై చెప్పేసినట్లే!!

0మెగాస్టార్ చిరంజీవి దాదాపు 9 ఏళ్ల పాటు కెమేరాకు దూరంగా ఉండి మళ్లీ సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. రాజకీయాల్లో క్రియాశీలంగా పాల్గొని.. ప్రజారాజ్యం పార్టీ పెట్టి.. ఆశించిన స్థాయిలో రిజల్ట్ అందక.. ఆ తర్వాత పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసేశారు. ఖైదీ నంబర్ 150తో సినిమాల్లోకి గ్రాండ్ గా రీ ఎంట్రీ ఇచ్చిన మెగాస్టార్.. ఇకపై మూవీ ఇండస్ట్రీలోనే కొనసాగాలని నిర్ణయించుకున్నట్లుగా కనిపిస్తోంది.

తను రాజకీయాలకు దూరం అవుతున్నట్లు కానీ.. రాజకీయ సన్యాసం చేస్తున్నట్లు కానీ చిరు ఎక్కడా ఎప్పుడూ చెప్పలేదు. అలాగని ఆయన పాలిటిక్స్ లో యాక్టివ్ గా పాల్గొనడం లేదు కూడా. రీసెంట్ గా కర్నాటక ఎన్నికలు జరగగా.. అక్కడ కాంగ్రెస్ పార్టీ బాగానే పట్టు చూపించింది. కానీ ఇక్కడ చిరు క్యాంపెయినింగ్ చేయలేదు. కనీసం కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఒక్క మాట కూడా ఎప్పుడూ మాట్లాడలేదు. ఇదంతా చూస్తుంటే.. ఇకపై తను సినిమాల్లోనే కంటిన్యూ కావాలని చిరు ఫిక్స్ అయినట్లు కనిపిస్తోంది.

ప్రస్తుతం సైరా నరసింహారెడ్డి మూవీ షూటింగ్ లో మెగాస్టార్ పాల్గొంటుండగా.. ఆ తర్వాత ప్రాజెక్టుపై కూడా ఇప్పటికే ఓ క్లారిటీ వచ్చేసిందని అంటున్నారు. వరుసగా సామాజిక అంశాలతో కమర్షియల్ హిట్స్ సాధిస్తున్న కొరటాల శివ దర్శకత్వంలో ఓ సినిమా రూపొందించేందుకు చిరు ఫిక్స్ అయినట్లు టాక్ వినిపిస్తోంది. అయితే.. రాజకీయాలకు చిరంజీవి దూరం కావడానికి మరో కారణం కూడా ఉందని అంటున్నారు.

ప్రస్తుతం చిరు సోదరుడు పవన్ కళ్యాణ్ తన సొంత పార్టీ జనసేనతో రాజకీయాల్లో బిజీగానే గడుపుతున్నారు. సినిమాలకు బై చెప్పేసి మరీ పాలిటిక్స్ లోకి దిగిపోయారు. ఇలాంటి సమయంలో మళ్లీ తను కాంగ్రెస్ వైపు మొగ్గితే.. అది ఫ్యాన్స్ కు తప్పుడు సంకేతాలు ఇచ్చినట్లు అవుతుందని.. తమ్ముడితో విరోధం అనే ప్రచారం జరుగుతుందని భావిస్తున్నారట చిరు. కాంగ్రెస్ ను విమర్శించినా.. ఏనాడు చిరంజీవిని ఒక్క మాట తప్పు పట్టలేదు పవన్ కళ్యాణ్. ఇలాంటి సమయంలో రాజకీయాల కారణంగా తమ కుటుంబంలో విబేధాలు వద్దని అనుకున్న చిరు.. కంప్లీట్ గా పాలిటిక్స్ కు బైబై అని డిసైడ్ అయిపోయారట.